ఉక్రెయిన్ : మహమ్మారి చెంత పుతిన్ అయినా యుద్ధం ఆగదు !
దేశాన్ని ప్రేమించడం బాధ్యత. అవార్డుల కోసం యుద్ధాలు చేయడం కూడా బాధ్యతేనా ! ఏమో ! మరి! అమెరికా మాట విని కయ్యానికి కాలుదువుతున్న ఉక్రెయిన్ ఇంకెన్నాళ్లని యుద్ధం చేయగలదని ? కానీ పోరాట స్ఫూర్తి చాటాలన్న కాంక్ష బలీయంగా ఉండడం, అందుకు అమెరికా ఆయుధ సంపత్తిని అందిస్తుండడంతో రష్యా వీటిని తిప్పికొట్టే ప్రయత్నాలు నిరాటంకంగా చేస్తోంది.
యుద్ధ ప్రభావం భారత్ లాంటి దేశాలపై నేరుగానే ఉంది. ఊహలకు అతీతంగా పెరుగుతున్న డీజిల్, పెట్రోలు ధరలు, అంతేలేని రీతిలో కరెంట్ కోతలు, థర్మల్ విద్యుత్ కేంద్రానికి బొగ్గు చేరకపోవడంతో నిలిచిపోతున్న వ్యవస్థలు, యుద్ధం కారణంగా బొగ్గు దిగుమతులు లేని పరిణామాలు ఇలా ఒక్కటేంటి ఎన్నో ! వాటిని నివారించేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాల్లేవు. వంట నూనె పెరిగిన, వాహనాన్ని నడిపే పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగినా ఏం జరిగినా భారత్ గుడ్లప్పగించి గూగుల్ వైపు చూస్తోంది. కానీ యుద్ధ పరిణామాల నిలువరింత కు చేస్తున్న కృషి సున్నా.
పుతిన్ కానీ జెలెన్ స్కీ కానీ తగ్గడం లేదు. ఆ విధంగా ఎవరి వాదన వారిది అన్న విధంగా తమని తాము తగువుల్లో ఇరికించుకుంటున్నాయి ఆ రెండు దేశాలు. యుద్ధం మొదలయి 70 రోజులు కావస్తున్నా పుతిన్ తగ్గడం లేదని, ఇది కలవరపాటుకు గురిచేసే విషయమేనని ప్రపంచ దేశాలు గగ్గోలు పెడుతున్నాయి. మరోవైపు ఆయన క్యాన్సర్ తో ఏడాదిగా బాధపడుతున్నారు. ఆ మహమ్మారి నుంచి బయట పడేందుకు శస్త్ర చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఈ వారంలోనే ఆయనకు శస్త్ర చికిత్స ఉందని తెలుస్తోంది. ఇవన్నీ ప్రధాన మీడియాలో వెలుగు చూస్తున్న విషయాలే అయినా ఆ రెండు దేశాలకూ సంబంధించి ఆశించిన స్థాయిలో శాంతి స్థాపనకు సంబంధించి ఒక్కటంటే ఒక్క వివరం కూడా నమోదు కాకపోవడం విచారకరం.
యుద్ధం ఎప్పుడో మొదలయిందో తెలియదు.. ఎప్పుడు ముగుస్తుందో కూడా తెలియదు.. అని అంటారు కదా! ఇది ఓ రైటర్ చెప్పిన మాట. ఆ విధంగానే రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య పరిణామాలు ఇవాళ ఉన్నాయి. యుద్ధ ఆరంభం అన్నది ఉక్రెయిన్ చేతిలో లేదు. ఆ రోజు లేదు. యుద్ధాన్ని ముగించే స్థితి ఇవాళ లేదు. ఇది రష్యాకు అంతుపోలని స్థితి. ఆ విధంగా నిద్రకు దూరం అయి ఉన్న రెండు నికృష్ట సందర్భాలను రెండు దేశాలూ చవి చూస్తున్నాయి. అయినా కూడా యుద్ధ కాంక్ష తీరడం లేదు. యుద్ధ భీతి అన్నది ప్రపంచాన్ని వీడిపోవడం లేదు.
ఒకనొక దశలో వెనక్కు తగ్గుదాం అని భావించిన ఆ 2 దేశాలు కూడా ఎందుకనో మళ్లీ తమ యుద్ధ కాంక్షనే పెంచుకున్నాయి. దీంతో మారణ హోమం రగులుతూనే ఉంది. ఉన్నంత వరకూ దేశాలను కాపాడాల్సిన ఇతర దేశాలు ప్రేక్షక పాత్రకు పరిమితం అయి ఉన్నాయి. ఈ తరహా విధ్వంసకర నేపథ్యాన ఆ 2 దేశాలూ తమని తాము రక్షించుకునే పని మాత్రం అస్సలు చేయడం లేదు. రష్యా మాటలు నమ్మి ఆ దేశ యువకులు తమ దేశ భూభాగంలోకి రావొద్దని ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్ స్కీ చెబుతున్నారు. ఎందుకంటే తమ దేశ సైనికులు సుశిక్షుతులయి ఉన్నారని ఆయన పదే పదే అంటున్నారు. యుద్ధంలో మరణిస్తారని, గాయపడతారని తెలిసి కూడా చాలా మంది సరైన శిక్షణలోని యువతను రష్యా తమ దేశం వైపునకు పంపుతోందని, కనుక యువకులు ముందు జాగ్రత్త వహించి ఇటుగా రావాలన్న ఆలోచననే విరమించుకోవాలని విన్నవించారు.