కరీంనగర్ కలెక్టరేట్ లో సమీక్షా సమావేశం జరుగుతుండగా రసాభాస చోటు చేసుకుంది. ముఖ్యంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా.. ఏ పార్టీ అని నిలదీశారు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. దీంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై మరొకరు దాడి చేసుకునేందుకు యత్నించారు. ముగ్గురు మంత్రులు కలెక్టరేట్ లో ఉండగానే ఇద్దరూ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం గమనార్హం.
ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదంతో పాటు తోపులాట జరిగింది. దీంతో సమీక్షా సమావేశం రసాభాస గా మారింది. దీంతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు బయటికి తీసుకెళ్లారు. కేసీఆర్ నాయకత్వంలో గెలిచిన ఎమ్మెల్యే కేసీఆర్ ఎజెండాతో ఉండాలి. నువ్వు ఏది పడితే అది మాట్లాడితే ఎవ్వరు ఊరుకుంటారని నిలదీశారు కౌశిక్ రెడ్డి. రైతులకు రూ.15వేలు ఇవ్వాలని, వికలాంగులకు రూ.6వేలు, దళితులకు దళిత బంధు ఇవ్వాలని అడుగుతున్నామని మీడియాకు తెలిపారు కౌశిక్ రెడ్డి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇచ్చే వరకు నిలదీస్తామన్నారు. కేసీఆర్ పెట్టిన బిక్షతో గెలిచి.. కాంగ్రెస్ తరుపున మాట్లాడితే ఊరుకోం అన్నారు. మొగోళ్లే అయితే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కౌశిక్ రెడ్డి.