న్యూఢిల్లీ : అప్పటికే గాడితప్పిన ఆర్థిక వ్యవస్థ.. కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక సంక్షోభం మరింతగా ముదిరింది. దేశంలో ఇలాంటి సంక్షోభ పరిస్థితులను నెలకొన్న నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంతో పాటు మెరుగైన స్థితికి తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2021-2022 సంవత్సరానికి గానూ సోమవారం లోక్సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకంటూ ఆరు సూత్రాలను ప్రకటించినా.. ప్రజల సంక్షేమానికి సంబంధించి పెద్దగా తాజా బడ్జెట్‌లో మెరుపులు కనిపించలేదు.
అయితే, రూ. 34.8 లక్షల కోట్లతో లోక్ సభలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో లక్ష్యాలు ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కల్పన, వ్యవసాయ రంగం చుట్టూ తిరిగినప్పటికీ పేదలకు, సగటు వేతన జీవికి పెద్దగా ఊరట కలిగించే అంశాలు లేకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశం. ప్రస్తుత బడ్జెట్ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఆర్థిక వ్యవస్థ పై ప్రభావం చూపుతుందా? లేదా? అనే విషయాన్ని పక్కనబెడితే.. నిర్మలమ్మ బడ్జెట్ లక్ష్యం మారిందా? బడ్జెట్ పయనం ఎటువైపు మళ్లింది అనే విషయాన్ని గమనిస్తే.. స్పష్టంగా ఎన్నికల వైపు మళ్లిందనే విషయం కనిపిస్తోంది.
ఎందుకంటే ప్రస్తుత బడ్జెట్ ను గమనిస్తే.. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా తాజా బడ్జెట్ ఉందని ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి వెనుక గల కారణాలు గమనిస్తే.. త్వరలో ఎన్నికలు జరగబోయే నాలుగు రాష్ట్రాలను కేటాయింపులు చూస్తే.. తమిళనాడుకు ఏకంగా రూ.1.03 లచ కోట్లు కేటాయించారు. చెన్నై మెట్రో ప్రాజెక్టుకు అదనంగా రూ.1,957 కోట్లను కేటాయించారు. ఎలాగైనా తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ పాగా వేయాలని అన్నా డీఎంకేతో కలిసి ముందుకు సాగడం కమళం వ్యూహాన్ని స్పష్టం తెలియజేస్తోంది. ఇక అసోం, బెంగాల్, కేరళ రాష్ట్రాలకు సైతం కేటాయింపులు భారీగానే ఉన్నాయి.
ఈశాన్య రాష్ట్రమైన అసోంకు మూడేండ్లలో రహదారులకు అభివృద్ధికి సంబంధించి రూ.34 వేల కోట్లను కేటాయించారు. అలాగే, బెంగాల్ కు 695 కిలో మీటర్ల రోడ్డు హైవే నిర్మాణానికి 25 వేల కోట్ల రూపాయలను కేటాయించారు. దీనికి తోడు ఈ రెండు రాష్ట్రాల్లో కాఫీ, టీ తోటల్లో పనిచేసే కార్మికుల కోసం ప్రత్యేకంగా వేయి కోట్ల రూపాయలను కేటాయించారు. ఇక త్వరలో ఎన్నికలు జరగబోయే దక్షిణాది రాష్ట్రమైన కేరళలకు రోడ్ల నిర్మాణానికి రూ.65 వేల కోట్లను కేటాయించారు. దీనిలో భాగంగా 23 ప్రాజెక్టులను అభివఈద్ది చేస్తామని ప్కకటించారు. ఇదివరకు ఆయా రాష్ట్రాల్లో కమళం నేతలు ప్రస్తావించిన ప్రాజెక్టులు గురించి ప్రజల చర్చ లేవకుండా ఈ కేటాయింపులు జరిగినట్టుగా తెలుస్తుంది.
ఇక తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణలకు పెద్దగా బడ్జెట్ ద్వారా లబ్ది చేకూరే అంశాలేవి కనిపించలేదు. నిర్మల బడ్జెట్ ప్రసంగంలోనూ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే అసోం,కేరళ, బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల కేటాయింపులు, మౌలిక సదుపాయాల కల్పన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికల వ్యూహాన్ని స్పంష్టంగానే తెలియజేస్తున్నదని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఇది ఎన్నిల టార్గెట్ గా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంటూ ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా ఆరోపిస్తూ.. విమర్శలు గుప్పిస్తున్నాయి.