త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్డీఏ మిత్రపక్షాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిసింది. బిహార్ నుంచి ఉపేంద్ర కుశ్వాహాకు కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎన్‌సీపీ, శివసేనతో పాటు బీహార్‌లోని ఇతర మిత్రపక్షాలకు చోటు లభించే ఛాన్సుంది. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కూడా జరగనున్నట్లు తెలిసింది.
జేపీ నడ్డా వారసుడిగా ఎవరొస్తారని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో త్వరలోనే పార్టీ కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 22, 23వ తేదీల్లో ప్రధాని మోదీ సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి బీజేపీ కొత్త చీఫ్ పేరును ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. ఇక అధ్యక్ష రేసులో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రదాన్, భూపేంద్ర యాదవ్, మనోహర్ లాల్ ఖట్టర్ ఉన్నారు. అయితే మనోహర్ లాల్ ఖట్టర్ వైపు హైకమాండ్ మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు సమాచారం.