కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు.. మజ్లిస్ కనుసన్నల్లో ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయడం లేదో ప్రజలకు జవాబివ్వాలని డిమాండ్ చేశారు. మజ్లిస్‌కు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం చేస్తోందని తెలిపారు. బేగంపేటలో ఎమ్మెల్సీ ఎన్నికపై నిర్వహించిన బీజేపీ సన్నాహక భేటీలో ఆయన మాట్లాడారు.
బీజేపీని ఓడించే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పని చేస్తున్నాయని కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలో ఉన్నా హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఎందుకు పోటీ చేయడం లేదో రాహుల్ గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన బీఆర్ఎస్.. ఈ ఎన్నికల్లో ఎందుకు బరిలోకి దిగడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే ఈ నగరం అభివృద్ధి చెందుతుందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ఎలా ఉండాలనేదానిపై కేటీఆర్ సర్టిఫికెట్ బీజేపీకి అవసరం లేదని అన్నారు.