భారత్‌తో బలమైన బంధం ప్రాముఖ్యతను అమెరికా రక్షణమంత్రి లాయిడ్ ఆస్టిన్ మరోసారి ప్రస్తావించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సుస్థిరతకు భారత్ చాలా అవసరమని ఆయన పునరుద్ఘాటించారు. అందుకనుగుణంగా ఇండియా సైనిక సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు సహకారం అందించాలని సెనేట్ ఆర్మ్‌డ్ సర్వీసెస్ కమిటీకి వివరిస్తూ.. దానికి కావాల్సిన బడ్జెట్ ప్రతిపాదనలను వారి ముందుంచారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సహకారం గురించి కమిటీకి ఆస్టిన్ తెలిపారు.
” హిందూ మహా సముద్రంలో భద్రత కోసం సంయుక్త సైనిక విన్యాసాలు, కీలక సమాచార మార్పిడి సహా ఇతర కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. దీంతో ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికా కలిసి చేస్తున్న ప్రయత్నాలకు దన్ను లభిస్తోంది. స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్ నిర్మాణానికి భారత్-అమెరికా మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం చాలా కీలకం. కమాండర్ ఎయిర్ డొమైన్‌లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని విస్తరిస్తున్నాం. రెండోళ్లకోసారి జరిగే ఏరో ఇండియాలో అమెరికా బీ-1బీ బాంబర్ విమానాలు పాల్గొంటున్నాయి. ద్వైపాక్షిక వైమానిక విన్యాసాలు ‘కోప్ ఇండియా’లోనూ అమెరికా భాగస్వామ్యమవుతోంది.” అని లాయిడ్ ఆస్టిన్ తెలిపారు.