దేశంలో కోవిడ్ మూడో వేవ్ రాకుండా అడ్డుకోవాలంటే టీకాలను వేగంగా వేయడం ఒక్కటే మార్గమని, రానున్న 2-3 నెలల్లో భారీ ఎత్తున టీకాలను వేస్తే కోవిడ్ మూడో వేవ్‌ను అడ్డుకోవచ్చని నారాయణ హెల్త్ చైర్ పర్సన్, సుప్రీం కోర్ట్ కోవిడ్ నేషనల్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు డాక్టర్ దేవి శెట్టి అన్నారు. ప్రస్తుతం కోవిడ్ కేసులు ఎక్కువ నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలను కోవిడ్ నుంచి రక్షించాలంటే టీకాలను వేయడం ఒక్కటే మార్గమన్నారు.
ఓ జాతీయ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవి శెట్టి మాట్లాడుతూ రాబోయే 2-3 నెలల్లో దేశంలో 18 ఏళ్లకు పైబడిన 51 కోట్ల మందికి టీకాలను ఇస్తే కోవిడ్ మూడో వేవ్ రాకుండా అడ్డుకోగలమని అన్నారు. కోవిడ్ మూడో వేవ్‌ను ఆపేందుకు అదొక్కటే మార్గమన్నారు. అందువల్ల ప్రభుత్వాలు టీకాలను వేసే కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలన్నారు. అనుకుంటే ఆ పని చేయడం పెద్ద కష్టమేమీ కాదని, భారత్ సాధించగలదని, కరోనాపై పోరాటం చేయగలదని అన్నారు.
ఇక దేశంలో ప్రస్తుతం కోవిడ్ బాధితులకు చికిత్సను అందించేందుకు తగినన్ని వైద్య సదుపాయాలు లేవని, సిబ్బంది కొరత ఉందని, వెంటనే వాటిని సమకూర్చుకోవాలని, లేదంటో మరింత మంది కోవిడ్ బాధితులు ఇబ్బందులు పడుతారని, మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు. లాక్ డౌన్‌లు విధించడం వల్ల కోవిడ్ చెయిన్‌ను బ్రేక్ చేయవచ్చు, కానీ ఇంకో వేవ్ రాకుండా అడ్డుకోలేమని, టీకాలను వేయడం ఒక్కటే మార్గమన్నారు.