భారత్లో మరికొద్ది నెలల్లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ స్టేడియం మిగతా వాటికంటే చాలా భిన్నంగా ఉండబోతోంది. ఎందుకంటే.. ఇది సాక్షాత్తు కాశీ విశ్వనాథుడు కొలువైన వారణాసిలో కొలువుదీరబోతోంది.
ఈ కొత్త క్రికెట్ స్టేడియం నిర్మాణానికి నేడు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షడు రాజీవ్ శుక్లా, కార్యదర్శి జై షా, మాజీ క్రికెటర్లు సచిన్ తెందూల్కర్, సునీల్ గావస్కర్, రవిశాస్త్రి తదితరులు హాజరుకానున్నారు. స్టేడియం నిర్మాణానికి రూ.330 కోట్లు ఖర్చుకానుంది.
ఈ స్టేడియాన్ని శివతత్వం ఉట్టిపడేలా రూపొందించారు. మరి ఆ ప్రత్యేకతలు ఏంటంటే..?
- త్రిశూలాన్ని పోలిన ప్లడ్‌లైట్లు
- శివుడి చేతిలో ఉండే ఢమరుకం రూపంలో పెవిలియన్ స్టాండ్
- గంగా ఘాట్ మెట్ల మాదిరిగా ప్రేక్షకుల గ్యాలరీ
- స్టేడియం ప్రవేశ ద్వారంలో బిల్వ పత్రం ఆకును పోలిన మెటాలిక్ షీట్‌లు
- అర్ధ చంద్రాకారాన్ని ప్రతిబింబించనున్న పైకప్పు
- సూమారు 30,000 సీటింగ్ సామర్థ్యం