భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పూనియా రాజకీయ ఆరంగేట్రానికి సర్వం సిద్ధమైంది. ఈ మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిసింది. రెండ్రోజుల క్రితమే రెజ్లర్లు ఇద్దరూ రాహుల్ గాంధీని కలిసిన విషయం తెలిసిందే.వచ్చే నెలలో హరియాణా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వారు పోటీ చేయడం ఖాయంగా తెలుస్తోంది. పారిస్ ఒలింపిక్స్ నుంచి భారత్‌కు తిరిగొచ్చాక వినేశ్ ఫొగాట్ ప్రస్తుతం బిజీ బిజీగా గడుపుతోంది.
ఖాప్ పంచాయతీ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నేతలు, రైతు సంఘాల నేతలు సైతం ఆమెను కలిసి చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బజరంగ్ పూనియా, వినేశ్ ఇద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఓకే చెప్పినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వీరద్దరికి ఎన్నికల్లో టికెట్ ఇచ్చేందుకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఓకే చెప్పినట్లు కూడా తెలుస్తోంది. అయితే, పారిస్ ఒలింపిక్స్ కంటే ముందు వినేశ్ ఫొగాట్, సాక్షిమాలిక్ డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషన్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని
ఆరోపిస్తూ దేశరాజధాని ఢిల్లీలో పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించగా.. వారికి మద్దతుగా బజరంగ్ పూనియా కూడా ఆందోళన చేపట్టి బ్రిజ్ భూషన్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.