సంక్షేమ విద్యాలయాల్లో కౌన్సిలర్ వ్యవస్థ అవసరం అని బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కౌన్సిలర్ వ్యవస్థ లేకనే విద్యార్ధుల ఆత్మహత్యలు కొనసాగుతుందని, దీనికి సీఎం రేవంత్ బాధ్యత వహించాలని ‘ఎక్స్’ వేదికగా ఆరోపించారు.గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో కౌన్సిలర్లను నియమించాలని సీఎం రేవంత్‌కు గతేడాది నుంచి విన్నవించుకుంటున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
కౌన్సిలర్ వ్యవస్థ ఉండి ఉంటే బహుశా మధిర కిష్టాపురం ఎస్సీ గురుకుల విద్యార్థికి చావు గురించి ఆలోచన వచ్చేది కాదన్నారు.భవిష్యత్‌ను భద్రంగా దాచుకునే ట్రంకు పెట్టెలు, బలవన్మరణాలకు సోపానాలుగా మారడం కాంగ్రెసు దుష్ట పాలనకు తార్కాణమని మండిపడ్డారు. నేటికి సంక్షేమ విద్యాలయాల్లో దాదాపు గా 55 మంది బిడ్డలు ప్రాణాలు కోల్పోయారని, ఇంకెంతమందిని బలి తీసుకుంటారు? అని ప్రభుత్వాన్ని ఆర్ఎస్పీ ప్రశ్నించారు.