మూడు దశాబ్దాల క్రితం ఆన్‌లైన్‌లో పుస్తకాలతో విక్రయం మొదలు పెట్టి… ఫలానా వస్తువు దొరకదు అనే స్థాయికి చేరుకుంది అమెజాన్ వ్యాపారం. అమెజాన్‌ను అంతర్జాతీయ ఆన్‌లైన్ దిగ్గజంగా తీర్చిదిద్దిన జెఫ్ బెజోస్… ఆ సంస్థ సీఈవో పదవి నుంచి తప్పుకున్నారు. మరి బెజోస్ ఇప్పుడు ఏం చేస్తారు? ఆయన స్థానంలో సీఈవో గా ఆండీ జాసీ నియమించడం వెనుక అమెజాన్ స్ట్రాటజీ వేరే ఉందా…
1995లో అమెజాన్‌ను ఏర్పాటు చేశారు జెఫ్ బెజోస్. గడిచిన మూడు దశాబ్దాల్లో అమెజాన్‌ను లక్షా 70 వేల కోట్ల డాలర్ల స్థాయికి తీసుకెళ్లారు. మన కరోన్సీలో చూసుకుంటే… అమెజాన్ విలువ అక్షరాలా… 127 లక్షల కోట్లు. అమెజాన్‌తో జెఫ్ బెజోస్‌ది విడదీయలేని బంధం. పుస్తకాల విక్రయంతో ప్రారంభించి… తమ వద్ద లభించని వస్తువు ఉండబోదనే స్థాయికి అమెజాన్‌ను తీసుకెళ్లారు జెఫ్ బెజోస్. అసాధ్యం అనుకునే కొన్ని పనులను కలిపి చేయడం ద్వారా..తర్వాత కాలంలో అవి అత్యంత సాధారణ పనులుగా మారిపోతాయంటారు బెజోస్. అందుకే ప్రజల్లోకి కిండల్, అలెక్సా, క్లౌడ్ కంప్యూటింగ్, కెరీర్ ఛాయిస్, జస్ట్ వాకవుట్, 1 క్లిక్ వంటి వాటిని సులువుగా తీసుకెళ్లగలిగారాయన.
అమెజాన్ ఈసీవో పదవి నుంచి తప్పుకుంటూ.. ఆ స్థానాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ చీఫ్ ఆండీ జాస్సీకి అప్పగిస్తున్నట్టు ప్రకటించారు బెజోస్. అయితే, అమెజాన్‌ను వీడి వెళ్లడం లేదాయన. అమెజాన్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగుతూ… సరికొత్త ఉత్పత్తులు, ప్రారంభస్థాయి పనులపై దృష్టి సారించబోతున్నారు జెఫ్ బెజోస్.
అమెజాన్ కొత్త సీఈవో 53 ఏళ్ల ఆండీ జాస్సీకి ఆ సంస్థతో సుదీర్ఘ అనుబంధం ఉంది. అమెజాన్ పెట్టిన రెండేళ్లకే ఆయన అందులో చేరారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో MBA చేసిన తర్వాత అమెజాన్‌లో చేరారు. బెజోస్‌కు సాంకేతిక సహాయకుడిగా… ఎప్పుడు వెన్నంటే ఉన్నారాయన. ప్రస్తుతం అమెజాన్ వెబ్ సర్వీసెస్- AWS క్లౌడ్ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు ఆండీ జాస్సీ. ఈ విభాగానికి వ్యవస్థాపకుడు కూడా ఆయనే. ఏడబ్ల్యూఎస్ విజయం కూడా అమెజాన్ సీఈవో గా ఆండీ జాస్సీ నియామకానికి ఓ కారణం.