ఏప్రిల్ 2 నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ ప్రకటన చేశారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకారం నెల రోజుల గడువు ఇచ్చామని.. మార్చి మూడవ తేదీ వరకు గడువు ఉందన్నారు. ఆ తర్వాత ఏ జిల్లాల నుంచి ఎలాంటి అభ్యంతరాలు వచ్చాయి…వాటిలో పరిశీలించదగిన అంశాలు ఏంటో జిల్లా కలెక్టర్లు పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తారని చెప్పారు.
ఈ ప్రక్రియ కు మరో వారం రోజుల సమయం పడుతుందని.. అంటే మార్చి 10 నాటికి నివేదిక లు ఇవ్వటం జరుగుతుందని వివరించారు. వీటన్నింటినీ చూసిన తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
రంప చోడవరం, నెల్లూరు జిల్లా ల్లో జోనల్ సమస్య వచ్చిందని.. ప.గో, కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో నాలుగు వందల వరకు అభ్యంతరాలు వచ్చాయన్నారు. రెవెన్యూ డివిజన్లకు సంబంధించి పెద్ద సమస్య ఉండదని.. అవసరాన్ని బట్టి రెవెన్యూ డివిజన్ల సంఖ్య పెంచే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పుడు ఉన్న 51 రెవెన్యూ డివిజన్లను 62కు పెంచామని.. ఉద్యోగుల విభజన ఇప్పుడు చేయటం లేదన్నారు. కొత్త జిల్లాల నుంచి పని చేయటం వరకే ఆదేశాలు ఇస్తారని.. కొత్తగా ఏర్పడుతున్న 13 జిల్లాల్లో అన్నీ ఇంటిగ్రేటెడ్ కలెక్టర్లు ఏర్పాటు చేస్తామని ప్రకనట చేశారు.