ఏపీలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖ. అన్నిరకాల రవాణా వ్యవస్థలు ఉండటంతో అక్కడున్న అవకాశాలను అందిపుచ్చుకునే వారు ఎక్కువయ్యారు. ఈ రేస్‌లో స్థానికులు వెనకబడ్డారనే చెప్పాలి. బ్రిటీషర్ల కాలం నుంచి ఉన్న సంస్థల్లో ఒకప్పుడు లోకల్ వాళ్లదే డామినేషన్. కానీ.. రోజులు మారే కొద్దీ బయట నుంచి వచ్చి స్థిరపడిన వారే తమ ముద్ర చాటుతూ వస్తున్నారు. దీనిపై పోరాటం చేద్దామని కొందరు స్థానికులు ప్రయత్నించినా వారికి శక్తి సరిపోక మౌనంగానే ఉండిపోయారు. కానీ ఇప్పుడు సిటీ ఆఫ్ డెస్టినీగా పేరు గాంచిన విశాఖలో సరికొత్త రాజకీయ ఉద్యమం పురుడు పోసుకుంటుంది.
ఉత్తరాంధ్రులకు ప్రధాన నగరంగా ఉన్న విశాఖలో మొదటి నుంచి స్థిరపడిన వారు ఆర్థికంగా సామాజికంగా వెనకబడిన వారే. విశ్వవిద్యాలయాలు ఉన్నా.. చదువుకున్న స్థానికులు తక్కువే. దీంతో బయట ప్రాంతాల నుంచి వలస వచ్చిన కొన్ని ప్రధాన సామాజికవర్గాలు ఇక్కడ బలమైన ముద్ర వేశాయి. రాజకీయ, విద్యా, వ్యాపార రంగాలలో చాలా పురోగతి సాధించాయి. విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉంది. అనేక కేంద్ర సంస్థలు కొలువు దీరాయి. వీటిల్లో ఇప్పుడు స్థానికుల కంటే బయట వారే ఎక్కువగా కనిపిస్తున్నారు.
రాజధాని వికేంద్రీకరణలో భాగంగా విశాఖను పరిపాలనా రాజధానిని చేసింది ప్రభుత్వం. ఆ తర్వాత బయట ప్రాంతాల వారి రాక ఇంకా పెరిగింది. అప్పటికే లోకల్.. నాన్ లోకల్ అంశాలపై మదన పడుతున్న వారికి తమ డామినేషన్ తగ్గిపోవడం అస్సలు రుచించడం లేదట. అందుకే చాపకింద నీరులా సరికొత్త రాజకీయ ఉద్యమం పురుడు పోసుకుంటుందని సమాచారం. అదే ఇప్పుడు వైజాగ్ సిటీలో హాట్ టాపిక్‌గా మారింది.
తెలంగాణ ఉద్యమమే ఇన్స్‌పిరేషన్‌గా యాంటీ నాన్‌లోకల్ మూమెంట్‌కు పావులు కదుపుతున్నారట కొందరు. విశాఖ జిల్లా అంతా ఇదే చర్చ జరుగుతోంది. యాంటీ నాన్‌లోకల్ ఉద్యమం త్వరలోనే తెరపైకి వస్తుందని ఈ విషయాలు తెలిసినవారు చెవులు కొరుక్కుంటున్నారు. వాల్తేరు క్లబ్ ఎన్నికల సందర్భంగా లోకల్.. నాన్ లోకల్ అంశం మరోసారి చర్చకు వచ్చిందట. ఎవరెవరో రావడం.. ఇక్కడ పాతుకుపోవడం.. తమ రాజకీయ లబ్ధి కోసం క్లబ్‌లో బయటవారికి ప్రాధాన్యం ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకతున్నారట.
లోకల్.. నాన్ లోకల్ విషయంలో ఇబ్బంది పడుతున్నవారంతా ఒకే వేదిక మీదకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ దిశగా ఉత్తరాంధ్రకు చెందిన కొందరు రహస్యంగా ఓ సమావేశం నిర్వహించినట్టు సమాచారం. ఆ భేటీలో బయట ప్రాంతాల వారివల్ల ఎదురైన ఇబ్బందులను సమావేశానికి వచ్చినవారు వెల్లడించారట.
ఇప్పడున్న రాజకీయ పరిస్థితుల్లో లోకల్.. నాన్ లోకల్ ఉద్యమం చేపడితే ఎలా ఉంటుందన్న చర్చ ఆ రహస్య సమావేశంలో జరిగిందట. ఎదురయ్యే పరిణామాలు.. ఇబ్బందులను కొందరు ప్రస్తావించినట్టు సమాచారం. కాకపోతే ఏదో ఒకటి చేయాలనే అభిప్రాయం మాత్రం మెజారిటీ సభ్యులు వ్యక్తం చేశారట. ఈ సీక్రెట్ మీటింగ్ గురించి తెలిసినప్పటి నుంచి ప్రధాన పార్టీలు ఆరా తీయడం మొదలుపెట్టాయట. ఎవరు మీటింగ్ కండక్ట్ చేశారు? వారి ఉద్దేశం ఏంటి? ఎవరిపై వారు దండెత్తబోతున్నారు? రాజకీయంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్న దానిపై అంతర్గతంగా చర్చించుకుంటున్నట్టు సమాచారం. మరి.. వైజాగ్‌లో ఈ యాంటీ నాన్ లోకల్ మూమెంట్ కార్యరూపం దాల్చుతుందో.. రహస్యంగానే ఉండిపోతుందో చూడాలి.