బోయినపల్లి కిడ్నాప్ కేసులో మరో ట్విస్ట్.. ఆయనా నిందితుడే !

బోయినపల్లి కిడ్నాప్ కేసులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ రోజు మూడో రోజు అఖిలప్రియ కస్టడీ ముగిసింది. మూడు రోజుల కస్టడీలో అఖిలప్రియ నుంచి చాలా విషయాలను పోలీసులు రాబట్టినట్లు సమాచారం. దాదాపు 300కు పైగా ప్రశ్నలకు పోలీసులు సమాధానాలు రాబట్టారు. అఖిల ప్రియ ఇచ్చిన సమాధానాలు ఆధారంగానే పలు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. ఎంజీఎం స్కూల్ అలాగే కిడ్నాప్ గ్యాంగ్ బసచేసిన కూకట్పల్లిలోని హోటల్లో అనేక కీలక ఆధారాలు సీజ్ చేసినట్లు చెబుతున్నారు.

అంతేకాక కిడ్నాప్ సమయంలో అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ అలాగే సోదరుడు జగత్  విఖ్యాత రెడ్డి కూడా బోయిన్పల్లి వరకు కార్లో వెళ్ళినట్లు సమాచారం. ఈ ఇద్దరితో లోధా అపార్ట్మెంట్ లో ఉన్న అఖిలప్రియ ఫోన్లో మాట్లాడినట్లుగా పోలీసులు ఆధారాలు సేకరించారు. కిడ్నాప్ తర్వాత భార్గవ్ రామ్ అలానే విఖ్యత్ ఇద్దరూ కలిసి మొయినాబాద్ ఫామ్ హౌస్ కి వెళ్ళారు. అక్కడ సంతకాలు చేయించినట్లు తెలుస్తోంది. అయితే కిడ్నాప్ వ్యవహారం మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కావడం, పోలీసుల దూకుడు గమనించిన అఖిల ప్రియ ప్లాన్ మార్చి కిడ్నాప్ చేసిన వారిని విడిచి పెట్టాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో విఖ్యాత్ రెడ్డి హస్తం కూడా ఉందని నిర్ధారణకు వచ్చిన పోలీసులు కేసులో అతనిని కూడా నిందితుడిగా చేరుస్తున్నారు.