ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు చెందిన యూజర్ల అకౌంట్లపై ఓ సరికొత్త మాల్‌వేర్ దాడి చేస్తోంది. యూజర్ల ఫోన్లలో ఆ మాల్‌వేర్ ఓ యాప్ రూపంలో ఇన్‌స్టాల్ అవుతుంది. అనంతరం యూజర్ అనుమతి లేకుండానే యూజర్ ఫోన్‌లోని కాంటాక్ట్‌లకు ఆటోమేటిగ్గా రిప్లైలు ఇస్తుంటుంది. ఈ మాల్‌వేర్‌ను ఎసెట్ కంపెనీకి చెందిన సెక్యూరిటీ నిపుణులు గుర్తించారు.
వాట్సాప్ యూజర్లకు ప్రస్తుతం ఒక మెసేజ్ వస్తోంది. అందులో ఉన్న లింక్‌ను క్లిక్ చేస్తే ఫోన్‌ను గెలుచుకోవచ్చు అని ఉంటుంది. దీంతో సహజంగానే యూజర్లు ఆ లింక్‌ను క్లిక్ చేస్తున్నారు. ఈ క్రమంలో గూగుల్ ప్లే స్టోర్‌ను పోలిన ఓ స్టోర్ యూజర్ల ఎదుట ప్రత్యక్షమవుతుంది. అందులో ఓ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచిస్తుంది. యూజర్ ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని దానికి అన్ని పర్మిషన్లు ఇవ్వగానే యూజర్‌కు చెందిన ఫోన్‌లోని వాట్సాప్ కాంటాక్ట్‌లకు ఆటోమేటిగ్గా ఆ యాప్ రిప్లైలను పంపిస్తుంటుంది. ఆ రిప్లైలోనూ యూజర్‌కు వచ్చినట్లుగానే మొబైల్ ఫోన్ గెలుచుకోవచ్చని లింక్ ఉంటుంది.
అయితే ఇలాంటి లింక్స్ ఏ యూజర్లకు అయినా వస్తే ఏమాత్రం వాటిపై క్లిక్ చేయవద్దని, అప్రమత్తంగా ఉండాలని సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. వాట్సాప్‌లో యూజర్లకు క్విక్ రిప్లై అనే ఫీచర్ అందుబాటులో ఉంది. దీని సహాయంతో యూజర్లు వాట్సాప్ మెసేజ్‌లకు నోటిఫికేషన్ల నుంచే రిప్లై ఇవ్వవచ్చు. అయితే ఈ ఫీచర్‌పైనే సదరు మాల్‌వేర్ అటాక్ చేస్తుందని నిపుణులు గుర్తించారు. కనుక యూజర్లకు పైన తెలిపిన లాంటి లింక్‌లతో కూడిన మెసేజ్ లు వస్తే క్లిక్ చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.