ఏపీలో టీడీపీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ నేతల మధ్య ఎంత మాత్రం పొసగని పరిస్థితి. పార్టీలో ఉండలేని వాళ్లు ఇప్పటికే బయటకు వెళ్లిపోతున్నారు. ఇక ఉన్న వారు సైతం ఒకరికి ఒకరికి పొసగక పోవడంతో ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇక తాజాగా జిల్లా టీడీపీ సమీక్ష సమావేశం సాక్షిగా తూర్పు నియోజకవర్గంలో దేవినేని వర్సెస్ గద్దె వర్గాలు బాబు సమక్షంలోనే గొడవకు దిగాయి. ట్విస్ట్ ఏంటంటే ఎమ్మెల్యే గద్దె విదేశాల్లో ఉండడంతో ఆయన ఈ సమావేశానికి హాజరు కాలేదు.
విజయవాడ నగరంలో టీడీపీకి సేవలందిస్తున్నామని, కానీ గద్దె వర్గం తమను చిన్నచూపు చూస్తోందని అధినేతకు ఫిర్యాదు చేశారు. కనీసం పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానం ఉండటం లేదని వారు చంద్రబాబుకు విన్నవించారు. పదవుల్లో సైతం తమకు అన్యాయం జరుగుతోందని వారు నేరుగా చంద్రబాబుకే వివరించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీచినా తూర్పులో మాత్రం గద్దె జగన్ గాలి ఎదుర్కొని మరీ విజయం సాధించారు.
నెహ్రూ గతంలో రద్దయిన కంకిపాడు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో కంకిపాడు, ఉయ్యూరు నియోజకవర్గాలను పునర్విభజిస్తూ పెనమలూరు నియోజకవర్గం వచ్చింది. కంకిపాడులో అధికభాగాన్ని విజయవాడ తూర్పులో కలిపారు. దీంతో తూర్పులో నెహ్రూకు మంచి పట్టు దొరికింది. అందుకే 2014లో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా 25 వేల ఓట్లు వచ్చాయి.
ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో అవినాష్ ఇక్కడ తమ కుటుంబానికి పట్టున్న తూర్పు సీటు ఆశించారు. అయితే బాబు చివర్లో ఆయన్ను గుడివాడకు పంపగా అక్కడ భారీగా ఖర్చు చేసినా ఓడిపోయారు. నెహ్రూ కాంగ్రెస్ నుంచి టీడీపీకిలోకి రావడంతో ఆయన వర్గం కూడా టీడీపీలోకి వచ్చింది. అయితే అప్పటికే తూర్పులో గద్దె రామ్మోహన్ వర్గం పట్టు సాధించింది.
ఇప్పుడు గద్దె నియోజకర్గంపై గ్రిప్ తెచ్చుకుని తన వర్గంతో హవా చెలాయిస్తున్నారు. ఇలా పదవులతో పాటు రాజకీయ ఆధిపత్యం విషయంలో దేవినేని వర్గం రేసులో వెనకపడిపోయింది. దీంతో ఇప్పుడు వారంతా తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తూర్పు టీడీపీలో దేవినేని, గద్దె వర్గాలుగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే దేవినేని వర్గం ఏకంగా సమీక్షా సమావేశంలో చంద్రబాబు దగ్గరే తాడోపేడోకి రెడీ అయ్యింది.