రాష్ట్రంలో మైనారిటీ ముస్లింలకు అన్ని రకాలుగా గుర్తింపు ఇస్తున్న ప్రభుత్వంగా జగన్ సర్కారు పేరు తెచ్చుకుంది. గతంలో ఐదేళ్లు పాలించిన చంద్రబాబు మైనార్టీ ముస్లింలకు ఎలాంటి పదవులు ఇవ్వలేక పోయారు. అయితే, ఎన్నికలకు ముందు షరీఫ్ వంటి వారికి కంటి తుడుపు పదవులు ఇచ్చినా.. మైనార్టీ సంక్షేమానికి సంబంధించి కూడా ఎలాంటి మంత్రిత్వ శాఖను ఆయన ఏర్పాటు చేయలేదు. దీనికితోడు వైసీపీ తరఫున గెలిచిన ఇద్దరు ముస్లిం ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారు. విజయవాడ పశ్చిమం ఎమ్మెల్యే జలీల్ ఖాన్, అనంతపురం కదిరి ఎమ్మెల్యే అంజాద్ బాషాలను తన పార్టీలోకి చేర్చుకున్నారు.
అయినా కూడా వారికి కూడా ఎలాంటి పదవులూ ఇవ్వలేదు. ఎన్నికలకు ముందు జలీల్‌కు వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవిని అప్పగిం చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మైనారిటీలు జగన్‌పైనే ఆశ పెట్టుకున్నారు. ప్రజాసంకల్ప యాత్రలోనూ వారు సంఘీభావం తెలిపారు. గతంలో మైనారిటీలకు రిజర్వేషన్ కల్పించిన(కోర్టు కొట్టి వేసింది) వైఎస్‌ను గుర్తుపెట్టుకున్న మైనారిటీలు అదే అభిమానాన్ని జగన్‌పై కొనసాగించారు.
ఈ క్రమంలో 2014లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారు. ఇక, తాజా ఎన్నికల్లోనూ మైనారిటీముస్లిం వైసీపీ అభ్యర్థులు భారీగానే విజయం సాధించారు.జగన్ కూడా మైనారిటీ వర్గం ఊహించని విధంగా ప్రాధాన్యం ఇచ్చారు. ఎమ్మెల్యే అంజాద్ బాషాకు ఏకంగా డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చి గౌరవించారు. ఇక, మక్కా యాత్రకు వెళ్లే వారికి ఇటీవలే ఖర్చులు కూడా పెంచారు. ఇక, ఇప్పుడు ముస్లింలు కోరకుండానే వారికి అనూహ్యమైన గిఫ్ట్ ఇచ్చారు జగన్. అబుల్ కలాం ఆజాద్ జయంతిని మైనారిటీ దినోత్సవంగా రాష్ట్ర పండుగగా నిర్వహిం చేందుకు జగన్ పచ్చజెండా ఊపారు.
వాస్తవానికి అబుల్ కలాం ఆజాద్ జయంతిరోజు విద్యాదినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అయితే, ఇకపై ఇదే రోజును మైనారిటీ సంక్షేమ దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ విషయం తెలిసిన ముస్లిం మైనార్టీ వర్గాలు.. ఇంతకన్నా ఎవరు మాత్రం ఏం చేస్తారని కొనియాడుతుండడం గమనార్హం. అదే టైంలో బాబు మైనార్టీల విషయంలో కంటి తుడుపు చర్యలు తీసుకుంటే జగన్ మాత్రం మా కళ్లల్లో నిజమైన ఆనందం నింపాడని కూడా వారు కొనియాడుతున్నారు.