ఆర్టీసీ వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. ప్రభుత్వం, కార్మిక సంఘాలు ఎవరూ తగ్గడం లేదు. దీంతో పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లేవారు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పటికే సమ్మె ప్రారంభమై నాలుగు రోజులవ్వడంతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తున్న నేపథ్యంలో.. రేపు (బుధవారం) సమ్మెపై కీలక సమావేశాలు కొనసాగనున్నాయి. బుధవారం ప్రభుత్వ పెద్దలతో ఆర్టీసీ ఉన్నతాధికారులు భేటీ అయి, పరిస్థితులను గురించి వివరించనున్నారు.
ఇప్పటికే డిపోల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో సమావేశాలు మొదలయ్యాయి. జేఏసీ నేతలు పూర్తి స్థాయి కార్యాచరణకు దిగేలా, తదుపరి వ్యూహ రచన చేసుకునేందుకు రేపు సమావేశం కానున్నారు. లీగల్ నోటీసుల విషయంపైనా వీరి మధ్య చర్చ జరగనుంది. మరోవైపు ఆర్టీసీ కార్మికుల పట్ల సర్కారు మొండి వైఖరిని అవలంభిస్తోందని ఆరోపిస్తూ, రేపు అఖిలపక్ష నేతలు సమావేశమై పరిస్థితిని చర్చించనున్నారు.