ఏపీలో అధికార వైసీపీకి ఈ ఎన్నికల్లో పార్టీ అధినేత జగన్ సొంత జిల్లా కడపతో పాటు మరో మూడు జిల్లాల్లో విపక్ష టిడిపికి ఒక్క సీటు కూడా దక్కలేదు. మొత్తం 13 జిల్లాల్లో నాలుగు జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం అంటే మామూలు విషయం కాదు.. వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో నెల్లూరు జిల్లా కూడా ఒకటి. వాస్తవానికి 2014 ఎన్నికల్లో సైతం జిల్లాలో ఉన్న పది అసెంబ్లీ సీట్లలో వైసిపి 7 సీట్లు గెలుచుకుంది. నెల్లూరు ఎంపీ సీటు సైతం వైసిపి ఖాతాలోనే పడింది. ఎన్నికల్లో టీడీపీ గెలిచిన మూడు సీట్లు వైసిపి స్వల్ప తేడాతో పోగొట్టుకుంది. ఇక ఎన్నికల్లో వైసిపి ప్రభంజనం ధాటికి జిల్లాలో టిడిపి ఒక్క సీటు కూడా గెలవలేదు. దీనిని బట్టి నెల్లూరు జిల్లాలో వైసిపి ఎంత స్ట్రాంగ్ గా ఉందో తెలుస్తోంది.
అలాంటి వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరుతో వైసిపి కంచుకోట బీటలు వారే ప్రమాదంలో పడింది. తాజాగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ పార్టీకి చెందిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఆరోపణలు చేయటం వైసిపి వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. వీరిద్దరి మధ్య గత కొన్ని రోజులుగా నడుస్తోన్న అధిపత్య పోరులో కోటంరెడ్డి అరెస్టు కావడంతో పరిస్థితి మరింత సీరియస్ గా మారింది. జిల్లాలో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి… కాకాణి గోవర్ధన్ రెడ్డి ఒక వర్గంగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరికి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తో పాటు… రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పొసగని పరిస్థితి ఉందంటున్నారు.
ఇక కావలి వైసీపీలో రెండు వర్గాలు ఉన్నాయి. ఇక కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి జిల్లాలో వైసీపీ తరఫున గెలిచిన తొలి ఎమ్మెల్యే. ఆయనతో పాటు మాజీమంత్రి, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సైతం ఎవరితోనూ కలవటం లేదు. మంత్రి పదవి కోసం ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో వచ్చే రెండు సంవత్సరాల తర్వాత అయినా తనకు మంత్రి పదవి వస్తుందన్న ఆశతో…ఎవరికివారు గ్రూపు రాజకీయాలను ఎంకరేజ్ చేస్తూ మిగిలిన నేతలను అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే ఇప్పుడు జిల్లాలో వైసీపీకి పెద్ద మైనస్ గా మారింది. దీనిపై జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించకపోతే నెల్లూరు జిల్లా వైసీపీ కంచుకోట బీటలు వారే ప్రమాదంలో పడడం ఖాయం.