కరోనా వచ్చాక కొత్తకొత్త పదాలను వింటున్నాం. అసలు మనకు అంతకుముందు వరకూ ఇలాంటి పదాలు ఉంటాయని కూడా సరిగ్గా తెలియదు కదా..లాక్ డౌన్, క్వారంటైన్, రెడ్ జోన్, గ్రీన్ జోన్ ఇంకా వేరియంట్, డైల్టా, స్ట్రైయిన్, ఒమిక్రాన్ ఇక ఇప్పుడు ఫ్లోరోనా. దీని గురించి ఇంకా మీకు తెలియకపోవచ్చు. ఇప్పుడిప్పుడే స్టాట్ అవుతుంది. ఒమిక్రాన్ తర్వాత.. ట్రెండింగ్ లో ఉంది ఫ్లోరోనానే. ఇక..దీని సంగతేంటో ఓసారి చూద్దాం.
‘ఫ్లోరోనా’ కొత్తగా ప్రాచుర్యంలోకి వచ్చినప్పటికీ… ఈ సమస్య పాతదా, కొత్తదా అనే సందేహం చాలామందికి ఉంది..ఎందుకంటే 2020 ఫిబ్రవరిలో ఇలాంటి లక్షణాలతోనే ఓ వ్యక్తి న్యూయార్క్ హాస్పిటల్‌లో చేరినట్టు ‘ద అట్లాంటిక్’ అనే జర్నల్ లో ప్రచురించారు. ఈ వ్యక్తిని పరీక్షించినప్పుడు తొలుత అతడికి ఇన్‌ఫ్లుయెంజా వైరస్ ఉందనీ, కొన్ని వారాల తర్వాత మళ్లీ పరీక్షించినప్పుడు ఈసారి కరోనా కూడా ఉందని తేలింది. దాంతో వారాల వ్యవధిలో అతడి కుటుంబ సభ్యులందరినీ పరీక్షించగా వారందరికీ ఇటు ‘కరోనా’ అటు ‘ఇన్‌ఫ్లుయెంజా’… ఈ రెండు వైరస్‌లూ ఉన్నట్లు వెల్లడైంది.. తాజాగా యూఎస్‌లోని హ్యూస్టన్‌లో క్రిస్‌మస్ అనంతరం నిర్వహించిన పరీక్షల్లో కొందరికి కరోనా, ఇన్‌ఫ్లుయెంజా… రెండూ ఉన్నట్లు గుర్తించారు. ఓ కేస్ స్టడీలా ‘అలెక్ జెర్లీన్’ అనే విద్యార్థిని పరీక్షించినప్పుడు ఈ విషయం వెల్లడైంది.
ఇలా రెండు రెండు సమస్యలు ఉండటం కొత్త విషయమేమీ కాదని ఫిలిప్పిన్స్ వైద్య పరిశోధకులు అంటున్నారు..ఫిలిప్పిన్స్ కు చెందిన నేషనల్ హెల్త్ డిపార్ట్‌మెంట్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూపు సభ్యుల్లో ఒకరైన డాక్టర్ ఎడ్సెల్ సల్వానా మాట్లాడుతూ… గతంలోనూ ఇలాంటి కొన్ని కేసులు వచ్చాయని..చైనాకు చెందిన ఒక రోగిలో కోవిడ్–19, ఇన్‌ఫ్లుయెంజా, నిమోనియాను కలిగించే స్ట్రెప్టోకోకస్ లాంటి అనేక సమస్యలను తాము చూశామని ఆయన పేర్కొన్నారు.
ఇక బ్రెజిల్‌లో సైతం ఓ పక్క ‘ఒమిక్రాన్’ కేసులు రావడం మొదలు కాగానే… ఇలాంటి ఫ్లురోనా కేసులు కనిపిస్తున్నాయని.. అక్కడి వైద్యాధికారులు అంటున్నారు. తమ దేశంలోనూ ఇప్పటి వరకు అధికారికంగా కనీసం ‘ఆరు’ ఫ్లురోనా కేసులు కనిపించాయని, ఇంకా 17 కేసులను క్షుణ్ణంగా విశ్లేషించాల్సి ఉందని…రియో డి జెనీరో మున్సిపల్ హెల్త్ సెక్రటరీ అయిన డేనియల్ సోరాంజ్ తెలిపారు.
‘ఫ్లురోనా’ అనే ఓ కొత్త పదం లాంటివి ఇంకా ఉన్నాయి. ఉదాహరణకు డెల్టా వేరియెంట్‌నూ, ఒమిక్రాన్‌ను కలిపి ‘డెల్‌మైక్రాన్’ అని కూడా అంటున్నారు. ఇక లక్షణాలను బట్టి ఇప్పటివరకూ ఈ ‘మహమ్మారి’ని ‘ప్యాండమిక్’ అంటూ నిపుణులు పిలుస్తూ వచ్చారు కదా. ఇప్పుడు… రెండ్రెండు జల్బులు కలిసి వచ్చే ఈ ‘ఫ్లూరోనా’ను కొందరు ‘ట్విన్–డమిక్’ అని పిలుస్తున్నారు.
ఇంకా ఎన్ని పదాలు వినాల్సివస్తుందో ..ఎన్ని ప్యాండమిక్ లు ఎదుర్కోవాల్సి వస్తుందో. అసలు రెండేళ్ల ముందు వరకూ ఎలా ఉండేది..ఇప్పుడు అంతా మారిపోయింది. మళ్లీ అలాంటి రోజులు ఎప్పుడో వస్తాయో. నిబంధనలు, ఆంక్షల మధ్యే జీవితం గడిచిపోతున్నట్లు ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మీరేమంటారు..!
-Triveni Buskarowthu