మానవత్వం మంట కలిసే సంఘటన ఒకటి ముంబయి నగరంలో వెలుగులోకి వచ్చింది. ఆడపిల్ల పుట్టిందని తెలిస్తే ఎక్కడ భర్త వదిలేస్తాడోననే భయాందోళనతో అప్పుడే పుట్టిన పసికందును పార్కింగ్ చేసిన కారులో వదిలి వెళ్లింది ఓ తల్లి. ఆ పసికందు గుక్కపట్టి ఏడువడంతో అసలు విషయం బయటకు వచ్చింది. స్థానికుల సమాచారంతో పసికందును హాస్పిటల్‌కు తరలించారు పోలీసులు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా కన్నతల్లిని పోలీసులు అరెస్టు చేశారు.
ముంబయి నగరంలోని శాంతినగర్‌లో పార్క్ చేసిన కారులో గుర్తుతెలియని వ్యక్తులు పసికందును వదలి వెళ్లారు. ఆ శిశువు గుక్క పట్టి ఏడవడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. కార్లు పార్క్ చేసిన చోట రక్తం మరకలను సైతం పోలీసులు గుర్తించారు. ఆ పసికందును కండివల్లిలోని శతాబ్ది హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిండు గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతూ నడుచుకుంటూ వెళ్లడం గమనించి దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఆ గర్భిణి ఫొటోల ఆధారంగా స్థానికులను పోలీసులు ఆరా తీశారు. భర్త, సోదరి, మరిదితో కలసి పార్కింగ్ ప్రాంతంలో సంచరించినట్లు గుర్తించారు. అనంతరం ఆ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. భార్యను అక్కడే వదలి భర్త పని నిమిత్తం తిరిగి కోల్‌కతాకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల విచారణలో ఆ మహిళ అసలు విషయం బయట పెట్టింది. ఆడపిల్ల పుట్టిందని తెలిస్తే భర్త తనను ఎక్కడ వదిలేస్తాడోనని భయపడినట్లు పేర్కొంది. తీవ్ర భయాందోళనతో పార్క్ చేసి ఉన్న ఓ కారులో పసికందును విడిచివెళ్లినట్లు అంగీకరించింది. అయితే, ప్రసవం అనంతరం తన చేతులతోనే బొడ్డు తాడును సైతం తొలిగించినట్లు పోలీసుల విచారణలో ఆ మహిళ వెల్లడించింది. దర్యాపు కొనసాగుతున్నదని పోలీసులు తెలిపారు.