కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తొలుత ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దానిని మే 3 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. లాక్ డౌన్ కారణంగా పూర్తిగా ప్రజా రవాణా బంద్ అయింది. అయితే అత్యవసర సర్వీసులకు అంతరాయం కలగకుండా టోల్ ఫీజ్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ప్రజారవాణా నిలిచిపోవడంతో.. ఆ ప్రభావం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాపై (ఎన్‌హెచ్ఏఐ) భారీగానే పడింది. మరోవైపు ఏప్రిల్ 20 తర్వాత కొన్ని రంగాలకు సడలింపులు ప్రకటించిన నేపథ్యంలో .. టోల్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎన్‌హెచ్ఏఐ, కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మధ్య అంతర్గతంగా చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే ఏప్రిల్ 20 నుంచి హైవేలపై ఉన్న టోల్ గేట్ల వద్ద ఫీజు వసూలు చేయాలని నిర్ణయానికి వచ్చింది.
అలాగే రాష్ట్రాల మధ్య వాహనాల రాకపోకలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కేంద్ర హోంశాఖ ఇటీవల ఆదేశాలు వెలువరించిన నేపథ్యంలోనే టోల్ ఫీజ్ వసూలు మళ్లీ ప్రారంభించాలని ఎన్‌హెచ్ఏఐ నిర్ణయించినట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఓ లేఖలో తెలిపింది.