కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ ఎఫెక్ట్ మన ఇండియా పై బాగానే పడుతుంది. ఈ కరోనా కొత్త వేరియంట్ కారణంగా తాజాగా కర్ణాటక ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా కర్ణాటక రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం కర్ణాటక రాష్ట్రంలో ఈనెల 28 వ తేదీ నుంచి.. నైట్ కర్ఫ్యూ అమలు కానుంది.
కర్ణాటకలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధించారు అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నైట్ కర్ఫ్యూ సమయంలో ప్రజలు బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ప్రజలందరూ మాస్కులు ధరించి బయటకు రావాలని ఆదేశాలు జారీ చేసింది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం.
కాగా ఇండియాలో ఇప్పటి వరకు అధికారికంగా 422 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే అనధికారికంగా మాత్రం ఈ కేసుల సంఖ్య450ని దాటిందని తెలుస్తోంది. ఇప్పటి వరకు 130 మంది ఓమిక్రాన్ బారి నుంచి రికవరి అయ్యారు. దేశంలో ఒక్క మహారాష్ట్రలోనే ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కేసుల సంఖ్య వందను దాటింది. దీంతో పాటు ఢిల్లీలో కూడా కేసుల తీవ్రత ఎక్కువగానే ఉంది. తరువాతి స్థానాల్లో గుజరాత్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి.