ఏకగ్రీవ ఎన్నికలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన పత్రికా ప్రకటన మీద ఫిర్యాదులు అందాయని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ సలహా లేకుండానే ప్రభుత్వం ప్రగడ పేపర్ ప్రకటన ఇచ్చిందని ఆయన అన్నారు. ఈ ప్రకటన మీద సంబంధిత అధికారులను ఇప్పటికే సంజాయిషీ కోరానని ఆయన అన్నారు. ఇక గతంలో జరిగిన ఎంపీటీసీ, జడ్పిటిసి ఏకగ్రీవాలా మీద విచారణ జరుగుతోందని అన్నారు.
వాటి మీద ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. అప్పట్లో బెదిరించి ఏకగ్రీవాలు చేశారని ప్రతిపక్షాలు తన దృష్టికి తీసుకు వచ్చాయని, సాధారణ ఏకగ్రీవాలు ఎవరు తప్పు పట్టరు కానీ అపరిమిత ఏకగ్రీవాలు జరిగితే తమ జోక్యం తప్పనిసరిగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఎన్నికల్లో పోటీ చేయాలని భావించే వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే అని ఆయన పేర్కొన్నారు. ఇక మీదట పత్రికా ప్రకటన ఇవ్వాలనుకుంటే ముందే పర్మిషన్ తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఎవరైనా పాటించాల్సిందేనని ఆయన అన్నారు.