నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలు తేదీ ఖరారైంది. నలుగురు దోషులకు కొత్త డెత్ వారెంట్ ను పటియాలా హౌస్ కోర్టు జారీ చేసింది. ఈ మేరకు అదనపు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా ఆదేశాలు జారీ చేశారు. మార్చి 3వ తేదీ ఉదయం ఆరు గంటలకు తీహార్ జైలులో నలుగురినీ ఒకేసారి ఉరి తీయనున్నారు. దోషులకు శిక్ష అమలు విషయంలో వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వస్తోంది. అటు దోషులు కూడా తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు ఉన్న న్యాయపరమైన అవకాశాలన్నింటినీ ఉపయోగించుకుంటూ తాత్సారం చేసుకుంటూ వచ్చారు.
కాగా.. దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ చేయాలన్న తీహార్ జైలు అధికారుల పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ సందర్భంగా మార్చి 3వ తేదీన ఉదయం ఆరు గంటలకు.. నలుగురు దోషులకు ఉరిశిక్షను అమలు చేస్తూ ఆదేశాలను జారీ చేసింది. మరోవైపు.. ఇప్పటికైనా తనకు న్యాయం జరుగుతుందని నిర్భయ తల్లి ఆశాదేవి వ్యాఖ్యానించింది. కోర్టుల చుట్టూ ఏడాదిన్నరగా తాను తిరుగుతున్నానని, తాజాగా పాటియాలా కోర్టు జారీచేసిన డెత్ వారెంట్ ల నేపథ్యంలో ఈసారైనా మార్చి 3న తప్పనిసరిగా దోషులకు ఉరి శిక్ష పడుతుందన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేసింది.