హైదరాబాద్ అభివృద్ధి ఘనత తమదేనంటున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర ప్రభుత్వ పాలసీల వల్లే హైదరాబాద్ కి మంచి మంచి కంపెనీలు వస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర విభజన సమయానికి తెలంగాణ దగ్గర ఎక్కువ డబ్బులున్నాయని, అప్పటికే అభివృద్ధికి సెంటర్ గా హైదరాబాద్ మారిందని చెప్పారామె. అత్యధిక ఆదాయం వచ్చే తెలంగాణను అప్పుల్లో ముంచేశారని మండిపడ్డారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో మీడియా సమావేశం నిర్వహించారు నిర్మలమ్మ. హైదరాబాద్ అభివృద్ధి క్రెడిట్ ని బీజేపీ ఖాతాలో వేసేందుకు ప్రయత్నించారు.
పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్ లోటు బడ్జెట్‌కు తీసుకువచ్చిందన్నారు. 2014లో రాష్ట్రం విభజన సమయంలో తెలంగాణలో ధనిక రాష్ట్రమని, తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్ రాష్ట్రాన్ని వేలకోట్ల అప్పుల పాలు చేశాడని తెలిపారు. రాబోయే తరాల మీద భారం మోపేలా కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలన ఉందన్నారు. అన్ని విధాలుగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ఘనత కేసీఆర్‌దని మండిపడ్డారు.ప్రజలకు ఉపయోగపడే పని ఏదీ బీఆర్ఎస్ చేయడం లేదన్నారు. బంగారం లాంటి రాష్ట్రాన్ని అధ్వాన్నంగా తయారు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో 6 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. రైతు సంక్షేమం కోసం తెలంగాణకు జాతీయ పసుపు బోర్డును మోదీ ఇచ్చారని ఆమె తెలిపారు. ఇక బీజేపీ అధికారంలోకి వచ్చాక ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తీసుకువచ్చిన మతపరమైన రిజర్వేషన్లను తొలగిస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని, రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు ఆర్డినెన్సు తీసుకురావడం సాధ్యం కాదని చెప్పారు. జనవరి 22న అయోధ్య దర్శనానికి తెలంగాణ వృద్దులను ఉచితంగా తీసుకెళ్తామన్నారు.