భాజపాకు నితీశ్ గుడ్​బై?.. ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు!

-

బిహార్​ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కొద్దికాలంగా భాజపా, జేడీయూ మధ్య దూరం పెరుగుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో.. బిహార్ విపక్ష ఆర్జేడీకి చెందిన సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. జేడీయూతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆర్జేడీ సిద్ధంగానే ఉందన్నారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ భాజపాతో సంబంధాలు తెంచుకుంటే జేడీయూకు మద్దతు ఇస్తామని ప్రకటించారు. ఇరు పార్టీల శాసనసభ్యులు మంగళవారం భేటీ కావడం సాధారణ విషయం కాదని అన్నారు.

“అసలు ఏం జరుగుతుందో వ్యక్తిగతంగా అయితే నాకు తెలీదు. కానీ, రెండు పార్టీలు కలిస్తే అసెంబ్లీలో తగిన సంఖ్యాబలం ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలు లేని సమయంలో ఇరుపార్టీలు ఇలాంటి భేటీ నిర్వహించడాన్ని తేలికగా తీసుకోకూడదు. అది సాధారణ విషయం కాదు. ఎన్​డీఏను దూరం పెట్టాలని నితీశ్ నిర్ణయం తీసుకుంటే ఆయనతో కలవడం తప్ప మాకు అవకాశాలేం ఉంటాయి? భాజపాపై పోరాడేందుకు ఆర్జేడీ సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి కూడా ఈ పోరులో భాగం కావాలనుకుంటే.. ఆయన్ను మాతో చేర్చుకుంటాం.”   – శివానంద్ తివారీ, ఆర్జేడీ జాతీయ ఉపాధ్యక్షుడు

నితీశ్​ నేతృత్వంలోని జేడీయూ.. కేంద్రంలో, బిహార్​లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్​డీఏ)లో భాగస్వామి. అయితే మిత్రపక్షాల మధ్య దూరం పెరిగినట్లు ఇటీవల అనేక వార్తలు వచ్చాయి. రాష్ట్రపతి ఎన్నికల సమయంలోనూ రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అవన్నీ తోసిపుచ్చుతూ ఎన్​డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకే జేడీయూ మద్దతు ఇచ్చింది.

అయితే, ఆదివారం జరిగిన నీతి ఆయోగ్ భేటీకి నితీశ్​ కుమార్ గైర్హాజరు కావడం రాజకీయంగా మరోసారి చర్చకు దారి తీసింది. కొవిడ్‌ బారిన పడిన నితీశ్‌ నీరసంగా ఉండటం వల్లే నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరు కాలేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆయన అదే రోజు పట్నాలో నిర్వహించిన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం గమనార్హం.

మరోవైపు, కేంద్ర మంత్రివర్గంలో జేడీయూ భాగం కాబోదని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ ఆదివారం స్పష్టం చేశారు. భాజపాతో ప్రస్తుతం బానే ఉందని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కేంద్ర మంత్రిమండలిలో ప్రాతినిధ్యం వహించేందుకు తమ పార్టీకి ఎలాంటి ఆసక్తి లేదని చెప్పారు. నీతి ఆయోగ్​ సమావేశానికి సీఎం ఎందుకు హాజరుకాలేదన్న ప్రశ్నకు.. ‘అది నితీశ్​నే అడిగితే బాగుంటుంది’ అని ముక్తసరిగా పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version