బిహార్ సీఎంగా నితీశ్.. ఎనిమిదో సారి ప్రమాణం.. ‘డిప్యూటీ’గా తేజస్వీ

-

బిహార్ ముఖ్యమంత్రిగా జనతాదళ్ నేత నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్​భవన్​లో గవర్నర్ ఫాగూ చౌహాన్.. నితీశ్​తో ప్రమాణం చేయించారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

అనూహ్య మలుపులు తిరిగిన బిహార్ రాజకీయం.. అధికార మార్పును చవిచూసింది. భాజపా నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్‌డీఏ)తో అయిదేళ్లుగా పెనవేసుకున్న బంధాన్ని తెంచుకున్న నితీశ్.. రాజీనామా చేసిన ఒక్కరోజు వ్యవధిలోనే మళ్లీ సీఎం పీఠమెక్కారు. తన రాజకీయ చతురతను చాటుకుంటూ.. మహా కూటమితో పూర్వ సంబంధాలను పునరుద్ధరించుకున్నారు.

ఆర్జేడీ, కాంగ్రెస్ సహా 7 పార్టీలతో జట్టుకట్టి మరోసారి అధికారంలోకి వచ్చారు. మంగళవారం 164 మంది ఎమ్మెల్యేల జాబితాతో రాజ్‌భవన్‌కు వెళ్లి.. 7 పార్టీలతో కూడిన మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు గవర్నర్​కు తెలిపారు నితీశ్.

నితీశ్‌ కుమార్‌ 2005 నుంచి ఇప్పటివరకు మొత్తం ఏడు పర్యాయాలు బిహార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 2000 సంవత్సరంలో ఎనిమిది రోజుల పాటే ముఖ్యమంత్రిగా కొనసాగినప్పటికీ.. ఆ తర్వాత 2005, 2010, 2015, 2017, 2020లో సీఎంగా బాధ్యతలు నిర్వహించి బిహార్‌లో తిరుగులేని నేతగా కొనసాగుతున్నారు. అయితే, ఏడు సార్లు ముఖ్యమంత్రి అయినా ఆయన ఎమ్మెల్యేగా ఎక్కడి నుంచీ ప్రాతినిధ్యం వహించకపోవడం గమనార్హం. శాసనమండలి సభ్యుడిగా ఉంటూ ఆయన సీఎంగా సేవలందిస్తూ వస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version