కరోనాతో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఆటోలో తరలించిన దారుణ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. నిబంధనల ప్రకారం ఆ వ్యక్తి మృతదేహాన్ని అంబులెన్స్ లేదా ఎస్కార్ట్ వాహనంలో సిబ్బంది..పీపీఈ కిట్లు ధరించి జాగ్రత్తగా తరలించాల్సి ఉంటుంది. ప్రభుత్వ వైద్య సిబ్బంది పర్యవేక్షణలో పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యుల మధ్య మృతదేహానికి అంత్యక్రియలు జరిపించాల్సి ఉంటుంది.
కానీ, నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో మాత్రం వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆటోలో కరోనా రోగి మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించడం కలకలం రేపుతోంది. డ్రైవర్‌తో పాటు ఆటోలో ఉన్న మరో వ్యక్తి కూడా పీపీఈ కిట్లు ధరించకపోవడం గమనార్హం. కానీ ఒకేసారి ముగ్గురు కరోనా రోగులు మరణించడంతో ఒక్కటే అంబులెన్స్ అందుబాటులో ఉన్నందున ఆటోలో తరలించామని ప్రభుత్వాసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.