ఇప్పుడు తెలంగాణలో లాక్‌డౌన్ పొడగిస్తారా లేదా అనేదే హాట్ టాపిక్. రాష్ట్రంలో కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్ విధించింది ప్రభుత్వం. అయితే రేపటితో లాక్‌డౌన్ ముగుస్తుండటంతో.. నేడు కేబినెట్ భేటీ నిర్వహించి, లాక్‌డౌన్ కొనసాగించాలా వద్దా అనే విషయంపై కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారు.
అయితే లాక్‌డౌన్ పొడగిస్తారనే వార్తలు హల్ చల్ చేస్తుండటంతో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనాను ఎదుర్కోవడానికి లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారం మార్గం కాదని స్పష్టం చేశారు. లాక్ డౌన్ తో పేదలు నానా ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు.
లాక్‌డౌన్‌లో నాలుగు గంటలే మినహాయింపు ఇస్తే పేదలు బతుకు దెరువు కోల్పోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. లాక్ డౌన్ విధించకుండా ఉంటే వారికి జీవనోపాధి దొరుకుతుందని కోరారు. కరోనాపై ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తే.. వైరస్‌ను కట్టడి చేయొచ్చన్నారు. అందరికీ వ్యాక్సిన్ వేస్తేనే దీనికి దీర్ఘకాలిక పరిష్కారమని ట్విట్టర్ ద్వారా కోరారు. అయితే కొవిడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మినీ లాక్‌డౌన్ పెట్టొచ్చని సూచించారు.