హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి శనివారం కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చట్టబద్ధంగా అనుమతులతో వెంచర్లు ఏర్పాటు చేసుకున్న వారు భయపడాల్సిన అవసరం లేదని.. చెరువుల వద్ద అనుమతులున్నా.. నిర్మాణాలు కూల్చివేస్తారని తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చెల్లుబాటు అయ్యే అనుమతులు ఉన్న నిర్మాణాలు కూల్చివేయమని సీఎం స్పష్టంచేశారు. అధికారులకు ఆదేశాలు సైతం ఇచ్చారు. సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు.
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలకు హైడ్రా కట్టుబడి ఉంటుందని రంగనాథ్ తెలిపారు.ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, నాలాలను కబ్జా చేసిన వారిపై హైడ్రా తన ప్రతాపం చూపిస్తుందన్నారు.పేదలకు ఎటువంటి నష్టం కలగించబోమన్నారు.హైడ్రా,మూసీ పునరుజ్జీవం వేర్వేరు అంశాలని నొక్కిచెప్పారు. మూసీ పరిసరాల్లో ఇప్పటివరకు కూల్చివేతలు జరపలేదన్నారు.కేటీఆర్, హరీశ్‌రావులు వారి ఫామ్‌హౌజ్‌లను కాపాడుకోడానికే పేదలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రియల్ ఎస్టేట్‌ను దెబ్బతీయడానికే ఇలా అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.