టెక్నాలజీ మాయలో పడి సాటి మనిషికి సహాయ పడాలన్నా విషయాన్నీ మరుస్తున్నారన్న దానికి ఈ ఫోటేనే ఉదాహరణ. ముఖ్యంగా ఇటీవల జరుగుతున్న కొన్ని ఘటనలు పరిశీలిస్తే మానవత్వం మంటగలిసి పోతుందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. అసలు విషయంలోకి వెళ్తే.. తమిళనాడులోని విల్లుపురం జిల్లాకు చెందిన సుబ్రమణి తన భార్య సోదరి కుటుంబాన్ని కలిసేందుకు పుదుచ్చేరిలోని సుతుకేనికి వచ్చాడు. క్షయ వ్యాధితో బాధపడుతున్న అతడి ఆరోగ్యం బుధవారానికి పూర్తిగా క్షీణించింది.
దాంతో ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించేందుకు ఉపక్రమించారు కుటుంబసభ్యులు. అయితే కూలి చేసుకొని బ్రతికే సుబ్రమణి బంధువుల వద్ద కనీసం మొబైల్ ఫోన్ కూడా లేదు.. దాంతో అంబులెన్సుకు ఫోన్ చేయలేకపోయారు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న తోపుడు బండిలో అతడిని తీసుకుని భార్యభర్తలిద్దరూ సుబ్రమణిని ఆస్పత్రికి తీసుకెళుతున్నారు. ఇక్కడ అవమానం ఏమిటంటే వారి బాధలు చూసిన బాటసారులు ఫొటోలు, వీడియోలు తీశారు గానీ సహాయం చేసేందుకు ముందుకు రాలేదు.
కనీసం అంబులెన్సుకు ఫోన్ చెయ్యాలన్న ఆలోచన కూడా చేయలేదు. కాగా తోపుడు బండిపై ఆస్పత్రికి చేరుకునే సమయానికే సుబ్రమణి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సరైన సమయంలో అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. బాటసారులు సాహాయం చేసి ఉంటే.. వారు హాస్పటల్‌కు సకాలంలో వెళ్లేవారు.. అతను బ్రతికేవాడు. ఇక సుబ్రమణి మృతి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయిపోయారు.