రాష్ట్రంలో టీడీపీ ఒకరకంగా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. అధికారం కోల్పోవడం, సీనియర్లపై కేసులు నమోదు కావడం, మరికొందరు రాజకీయంగా కుదేలవడం, ఇంకొందరు ఏకంగా సైకిల్ దూకేయడం వంటి పరిణాలు చోటు చేసుకున్నాయి. దీంతో పార్టీ ఇప్పుడు అస్తిత్వ పోరాటంలోనే ఉందని చెప్పాలి. దీంతో పార్టీని నడిపించేందుకు, భవిష్యత్తులో పుంజుకునేలా చేసేందుకు కూడా రాజకీయంగా కీలకమైన నాయకులు ఎవరైనా ఉన్నారంటే.. వారు యువ నేతలే. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా యువ నాయకులే పార్టీని నడిపించాలని పార్టీ అధినేతగా చంద్రబాబు సైతం పిలుపునిస్తున్నారు.
కానీ, కొందరు యువ నేతలు బాబును పట్టించుకుంటున్నా.. చాలా మంది యువ తేజాలు మాత్రం పార్టీపై ఉదాసీనంగా ఉన్నారు. మళ్లీ ఎన్నికలు వస్తేనే తప్ప తాము జెండా పట్టుకునేది లేదనే భావన వారిలో కనిపిస్తోంది. వీరిలో సత్తాలేక కాదు.. పార్టీ నుంచి వీరికి సరైన సపోర్టు లేకపోవడమేనని తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా విషయాన్ని తీసుకుంటే.. రాజాం నియోజకవర్గంలో యువనాయకురాలు మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ.. తనకు పగ్గాలు ఇవ్వండి పార్టీని పరుగులు పెట్టిస్తానంటున్నారు. కానీ, అధిష్టానం ఉలకదు పలకదు.
గుంటూరులో రాజకీయ దిగ్గజం రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగారావుది కూడా ఇదే వాదన కానీ, బాబు పట్టించుకోరు. అదేవిధంగా విజయవాడ పశ్చిమనియోజకవర్గంలో సీనియర్లు కూడా ఇదే వాదన వినిపిస్తున్నారు. ఇక్కడ ఎవరికీ పగ్గాలు అప్పగించలేదు. పోనీ ఎవరో ఒకరు పార్టీ జెండాను మోసేందుకు సిద్ధపడినా మిగిలిన వారు కయ్యానికి దిగుతున్నారు. వీరినా పార్టీ సముదాయించడం లేదు. ఇక, అనంతపురంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.
గత ఏడాది ఎక్కువ మంది యువ నాయకులు టికెట్లు సంపాయించుకుంది ఈ జిల్లాలోనే అయితే, వీరు ఇప్పుడు పార్టీకి కడు దూరంలో ఉన్నారు. పరిటాల శ్రీరాం, జేసీ పవన్, అస్మిత్‌రెడ్డిలు ఈ బాపతు యువ నాయకులు. ఇక, శ్రీకాళహస్తిలోనూ ఇలాంటి వివాదాలు నడుస్తున్నాయి. ఏదేమైనా వీరు పార్టీలో ఉన్నా పార్టీ కోసం పని చేసేందుకు ఆసక్తితో లేరనే తెలుస్తోంది. మరి ఇప్పటికైనా చంద్రబాబు పట్టించుకుని యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందనే టాక్ బాహాటంగానే వినిపిస్తుండడం గమనార్హం.