ఫోన్ ట్యాపింగ్ కేసులో కుట్రలో భాగంగానే పోలీసులు తనకు నోటీసులు ఇచ్చారని బీఆర్ఎస్ నేత, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం ఉదయం నార్కట్‌పల్లిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. తప్పకుండా విచారణకు హాజరవుతానని చెప్పారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానని అన్నారు. ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగానే జరుగుతోందని, అందుకే తనకు నోటీసులు ఇచ్చారని ఫైర్ అయ్యారు.
నోటీసులపై న్యాయ పోరాటం చేస్తానని, ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తున్నందుకే ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను ఇరికిస్తున్నారన్నారు.‘జిల్లాలో పనిచేసిన పోలీసులతో మాట్లాడి ఉండొచ్చు.పోలీసు అధికారుల పోస్టింగుల కోసం, కార్యకర్తల అవసరాల కోసం తాను మాట్లాడటం సహజమే’ అని చెప్పారు. నేడు విచారణకు హాజరయ్యేందుకు నార్కట్‌పల్లి నుంచి చిరుమర్తి లింగయ్య హైదరాబాద్‌కు బయల్దేరారు. జూబ్లీహిల్స్ పీఎస్‌లో విచారణ కాసేపట్లో ప్రారంభంకానుంది.