తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో కొత్తగా 1,827 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు అనుమతులు మంజూరు చేస్తూ నేడు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బోధనాస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను నేరుగా తెలంగాణ మెడికల్ హెల్త్ అండ్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు.ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే సీఎం కేసీఆర్ లక్ష్యాన్ని వేగంగా చేరుకుంటున్నామని మంత్రి హరీశ్ రావు చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 26కు చేరిందన్నారు.
వచ్చే ఏడాదిలో మరో 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దీంతో పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువ అవుతుండటంతో పాటు, తెలంగాణ బిడ్డలకు వైద్య విద్య చేరువ అవుతుందన్నారు.మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన వైద్యులను, నర్సులను, ఇతర సిబ్బందిని భర్తీ చేస్తున్నామని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఇప్పటికే 1061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేసి, వారిని టీచింగ్ ఆసుపత్రుల్లో నియమించామని వివరించారు. ప్రస్తుతం 1827 మంది స్టాఫ్ నర్సులను భర్తీ చేస్తామన్నారు. దీంతో ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని తెలిపారు. 1827 మందికి ఉద్యోగ అవకాశం కలుగుతుందన్నారు.