బ్యాటరీ కార్లను అద్దెకు తీసుకోదలచిన వారు ముందుగా జూమ్ కార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులో తమ డ్రైవింగ్ లైసెన్స్ వివరాలను, కార్డు ఫొటోను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు సేవలు జనాలకు ఎలా ఉపయోగపడుతున్నాయో అందరికీ తెలిసిందే. ఆరంభంలో ఈ రైళ్లలో అంతగా ప్రయాణికులు ఉండేవారు కాదు. కానీ ఇప్పుడు ఈ రైళ్లలోనూ రద్దీ ఎక్కువైంది. ఇక మెట్రో స్టేషన్ల వద్ద ఇప్పటి వరకు ప్రైవేట్ క్యాబ్ సర్వీస్‌లు, స్కూటీలు, సైకిళ్లు సేవలు అందిస్తూ వచ్చాయి. అయితే ఇకపై మెట్రో స్టేషన్ల వద్ద ప్రయాణికులు బ్యాటరీ కార్లను అద్దెకు కూడా తీసుకోవచ్చు. బ్యాటరీతో నడిచే ఆ కార్లు మియాపూర్ మెట్రో స్టేషన్ లో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి.
కాగా ఈ బ్యాటరీ కార్లకు గంటకు అద్దె రూ.40 వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మొదటగా మహీంద్రా కంపెనీ 25 బ్యాటరీ కార్లను అందుబాటులోకి తెచ్చింది. త్వరలో మిగిలిన మెట్రో స్టేషన్లలోనూ ఈ బ్యాటరీ కార్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఈ కార్లను మియాపూర్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుతోపాటు మాదాపూర్ ప్రాంతాలకు నడుపుతున్నారు. మియాపూర్ మెట్రో స్టేషన్‌లో దిగే ప్రయాణికులు కారు కావాలనుకుంటే ఈ బ్యాటరీ కార్లను అద్దెకు తీసుకోవచ్చు.
కాగా ఈ బ్యాటరీ కార్లను నడిపించేందుకు మెట్రో యాజమాన్యం జూమ్ కార్ సంస్థతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో బ్యాటరీ కార్లను అద్దెకు తీసుకోదలచిన వారు ముందుగా జూమ్ కార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులో తమ డ్రైవింగ్ లైసెన్స్ వివరాలను, కార్డు ఫొటోను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత కార్ లాక్‌ను అన్‌లాక్ చేసుకుని డ్రైవింగ్ చేయవచ్చు. ఈ క్రమంలో కారును ఎన్ని గంటలు వాడుకుంటారో ఆ యాప్‌లో ముందుగానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు గాను అయ్యే మొత్తాన్ని ఆన్‌లైన్ లో చెల్లించాలి. కాగా ఈ కార్లలో జీపీఎస్ సిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. అందువల్ల వాటిని గమ్యస్థానాలకు తీసుకెళ్లగానే అవి ఆటోమేటిక్‌గా లాక్ అవుతాయి. తిరిగి అక్కడి నుంచి ఎవరైనా మియాపూర్ స్టేషన్‌కు రావాలనుకుంటే.. పైన చెప్పిన విధంగా యాప్‌లో కారును బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
కాగా ఈ బ్యాటరీ కార్ల వల్ల క్యాబ్ ఖర్చు బాగా తగ్గుతుందని ప్రయాణికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా క్యాబ్‌లలో అయితే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ ఈ బ్యాటరీ కార్లను అద్దెకు తీసుకుంటే చాలా తక్కువ ఖర్చుతోనే కావల్సిన గమ్యస్థానానికి చేరుకోవచ్చని ప్రయాణికులు చెబుతున్నారు. ఇక ఈ కొత్త ప్రయోగం వల్ల మరింత మంది ప్రయాణికులు మెట్రో సేవలను వినియోగించుకుంటారని మెట్రో అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా.. ఈ బ్యాటరీ కార్ల అద్దె సర్వీసు నిజంగా ఎంతో మంది మెట్రో ప్రయాణికులకు మేలు చేస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు..!