ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ శుభవార్త చెప్పింది. ఇకపై అందులోని సూపర్ కాయిన్స్‌తో బయట కూడా మనం చెల్లింపులు జరపొచ్చు. అందుకు గాను ఫ్లిప్‌కార్ట్ దేశవ్యాప్తంగా ఉన్న 5వేలకు పైగా ఆన్లైన్, ఆఫ్‌లైన్ రిటెయిల్ స్టోర్స్‌లో ఈ సదుపాయం అందిస్తోంది. దీంతో ఫ్లిప్‌కార్ట్‌లోని సూపర్ కాయిన్స్ ను ఉపయోగించి ఆయా స్టోర్స్‌లో వస్తువులను కొనవచ్చు. లేదా ఇతర చెల్లింపులు కూడా జరపవచ్చు.
ఇప్పటివరకు ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్న సూపర్ కాయిన్స్‌తో కేవలం అందులో మాత్రమే వాటిని వాడుకునేందుకు వీలుండేది. కానీ వాటిని ఇకపై ఆఫ్ లైన్ స్టోర్స్‌లోనూ ఉపయోగించుకోవచ్చు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సూపర్ కాయిన్ పే అనే పేరు పెట్టారు. వినియోగదారులు సూపర్ కాయిన్ పే అందుబాటులో ఉన్న స్టోర్ లో ఏవైనా వస్తువులను కొంటే అందులో ఫ్లిప్‌కార్ట్ సూపర్ కాయిన్స్‌తో చెల్లింపులు జరపొచ్చు. ఇందుకు గాను ఫ్లిప్‌కార్ట్‌లోని సూపర్ కాయిన్స్ సెక్షన్ లో అందుబాటులో ఉంటే ఫీచర్ సహాయంతో రిటెయిలర్ దగ్గర ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. దీంతో యూజర్ అకౌంట్ లో ఉండే సూపర్ కాయిన్స్‌తో ఆయా వస్తువులకు అయ్యే మొత్తం చెల్లింపు జరుగుతుంది.
కాగా ఈ సదుపాయంతో వినియోగదారులు ఫ్యాషన్, ఫుడ్, పానీయాలు, గ్రాసరీలు, హెల్త్ అండ్ వెల్ నెస్ ఉత్పత్తులను ఆఫ్ లైన్ స్టోర్లలోనూ కొనుగోలు చేయవచ్చు. అలాగే ట్రావెల్ సేవలను పొందవచ్చు. సూపర్ కాయిన్స్‌తో ఫ్లిప్‌కార్ట్ ఇప్పటి వరకు ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్ షిప్‌ను కూడా ఆఫర్ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో ప్రస్తుతం అందిస్తున్న ఈ సదుపాయం అదనపు ఆకర్షణగా నిలుస్తుందని చెప్పవచ్చు.