ఆ హీరోకు బాగా కనెక్ట్​ అయ్యా.. వీరాభిమానిని: ఎన్టీఆర్

-

“అంతర్జాతీయ స్థాయిలో చిత్ర పరిశ్రమ ఒత్తిడికి లోనవుతోంది. ప్రేక్షకుడికి ఇప్పుడు మనం ఇస్తున్నదానికంటే కొత్తది ఇంకేదో కావాలి. ఒత్తిడిలోనే బాగా పనిచేస్తామని నేను నమ్ముతాను. పరిశ్రమ మొత్తం ఈ సవాల్‌ని స్వీకరిద్దాం. మరిన్ని గొప్ప చిత్రాలు చేద్దాం” అన్నారు ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్‌. ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ‘బ్రహ్మాస్త్ర’ విడుదల ముందస్తు వేడుకకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

రణ్‌బీర్‌ కపూర్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. అలియాభట్‌ కథానాయిక. అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, మౌనీరాయ్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించారు. స్టార్‌ స్టూడియోస్‌, ధర్మ ప్రొడక్షన్స్‌, ప్రైమ్‌ ఫోకస్‌, స్టార్‌లైట్‌ పిక్చర్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఎస్‌.ఎస్‌.రాజమౌళి సమర్పకులు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ నెల 9న ఈ సినిమా తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమా వేడుకని మొదట రామోజీ ఫిలింసిటీలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే వేడుక నిర్వహణ కోసం ఆఖరి నిమిషంలో దరఖాస్తు చేసుకోవడంతో బందోబస్తుని కల్పించడం కష్టమని అనుమతులు నిరాకరించినట్టు అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు తెలిపారు.

దాంతో హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో వేడుకని నిర్వహించింది చిత్రబృందం. ఈ సందర్భంగా వేడుకని ఉద్దేశించి ఎస్‌.ఎస్‌. రాజమౌళి మాట్లాడుతూ ‘‘రామోజీ ఫిలింసిటీలో ప్రపంచంలోనే అత్యుత్తమైన వేడుకని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. ఐదు రోజుల ముందు కూడా పోలీస్‌ కమిషనర్‌ దగ్గర్నుంచి అనుమతి వచ్చింది. అన్నీ బాగున్నాయని చెప్పారు. కొన్ని మార్పులు కూడా సూచించారు. ఈ రోజు గణేశ్‌ ఉత్సవాల్ని దృష్టిలో ఉంచుకుని పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయలేమన్నారు. సినిమా విజయోత్సవంలో భాగంగా ఆ వేడుకని నిర్వహిద్దాం. అస్త్రాల్ని, వాటిని వినియోగించే సూపర్‌హీరోస్‌ని ఊహించుకుని ఈ సినిమా చేయడం చాలా బాగుంది. మన సంస్కృతిలో, సంప్రదాయాల్లో నుంచి పుట్టిన కథ ఇది. ఇందులో నాగార్జున నంది అస్త్రం ధరించారు. ఇకపై దేశం మొత్తం భాషా పరమైన సినిమాలు కాకుండా భారతీయ సినిమాలు చేయాలనేది నా అభిప్రాయం’’ అన్నారు.

అభిమానులకి క్షమాపణలు:  ‘‘ఎంతో ఆర్భాటంగా వేడుకని నిర్వహించాలనుకున్నారు. భద్రత కారణాలతో కుదరలేదు. పోలీసుల మాట వినడం ఈ దేశపౌరుడిగా ప్రథమధర్మం. వేడుకకి వద్దామనుకున్న అభిమానులు, వచ్చినవాళ్లందరికీ కూడా తలవంచి క్షమాపణలు చెబుతున్నా. అమితాబ్‌ బచ్చన్‌ నటనలో గాఢతకి, ఆయన గళానికి, ఆయన కళ్లకి అభిమానిని. అమితాబ్‌ తర్వాత రణ్‌బీర్‌ నాకు బాగా కనెక్ట్‌ అవుతారు. ఈ తరంలో అత్యుత్తమ నటి అలియా. నాకు మంచి స్నేహితురాలు. నేను ఎక్కువగా నా భావోద్వేగాల్ని పంచుకునేది రాజమౌళి తర్వాత, నాగార్జున బాబాయ్‌తో. మూడో వ్యక్తి అలియా’’

హీరో నాగార్జున మాట్లాడుతూ…. అన్న హరికృష్ణ జయంతి ఈ రోజు. ఆయన బిడ్డ ఎన్టీఆర్‌ ఈ వేడుకలో కూర్చోవడం ఆనందంగా ఉంది. రాజమౌళి ఈ సినిమాని సమర్పిస్తున్నారంటే అది ఆషామాషీ కాదు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో కరణ్‌జోహార్‌, మౌనీరాయ్‌, కె.మాధవన్‌, విక్రమ్‌ దుగ్గల్‌, అపూర్వ మెహతా, నమిత్‌ మల్హోత్రా, మరిక్‌ డిసౌజా తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version