ఎన్టీఆర్​ టు విజయ్​దేవరకొండ.. వీరంతా వెండితెర ఆచార్యులు

-

మాతృదేవోభవా..! పితృదేవోభవా..! ఆచార్య దేవోభవా..! మన సంస్కృతితో తల్లి, తండ్రి తర్వాత గురువుకే విశిష్ఠ స్థానం ఉంది. ఎందుకంటే గురువులు పాఠాలు చెప్పడంతోనే ఆగిపోరు. విద్యార్థులతో మమేకమైపోయి.. అక్షరాలు నేర్పించి, లోకమంటే ఏంటో తెలిసేలా చేస్తారు. శిష్యుల ఉన్నతిలోనే తాము ఎదిగినట్లు భావిస్తారు. విద్యార్థులతో అల్లరి చేస్తారు. కష్టనష్టాల్లో పాలు పంచుకుంటారు. ఓడిపోతుంటే గెలిచే శక్తిని, యుక్తిని నూరిపోస్తారు. అయితే నేడు సెప్టెంబర్‌ 5న ఉపాధ్యాయుల దినోత్సవంగా.. వెండితెరపై ఉపాధ్యాయుడిగా కనిపించిన హీరోలెవరో తెలుసుకుందాం..

నటరత్న ఎన్టీఆర్​ అనేక చిత్రాలలో ఉపాధ్యాయునిగానూ, అధ్యాపకునిగానూ నటించి అలరించారు. బడిపంతులు, మిస్సమ్మ, వివాహబంధం, దేవత, పుణ్యవతి, విశ్వరూపం వంటి చిత్రాలలో రామారావు పంతులుగానూ, పాఠాలు చెప్పే లెక్చరర్ గానూ కనిపించి ఆకట్టుకున్నారు.

ముఖ్యంగా బడిపంతులు తెలుగులో క్లాసిక్‌ చిత్రంగా నిలిచింది. పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల జీవితానికి అద్దం పడుతుందీ సినిమా. ఇందులో సీనియర్‌ ఎన్టీఆర్‌ స్కూల్‌ టీచర్‌గా చేశారు. ఓ గురువు విలువలతో కూడిన జీవితాన్ని ఎలా కొనసాగించాలో చూపించిన సినిమా ఇది. బళ్లో విద్యార్థులకు పాఠాలు చెబుతున్నప్పుడు, చేసిన తప్పులు సరిచేస్తూ వ్యక్తిత్వాలను తీర్చిదిద్దుతున్నప్పుడు ఆయన వ్యవహరించే తీరు చాలా హుందాగా ఉంటుంది. పంతులుగా పదవీ విరమణ తీసుకున్న తర్వాత జీవితంలో ఏర్పడే విషాదం, నిర్లిప్తతలను అద్భుతంగా చూపిస్తారు సినిమాలో. క్లైమాక్స్‌లో వేలానికి వెళ్లిన బడిపంతులు ఇంటిని ఆయన శిష్యుడే కొనుగోలు చూసి తిరిగి అప్పగించడం హైలైట్‌గా నిలుస్తుంది. గురుశిష్యుల మధ్య ఉండే అనుబంధాన్ని అద్భుతంగా చూపించిన సినిమా ఇది.

నటసామ్రాట్​ ఏయన్నార్ సుమంగళి, తాండవకృష్ణుడు, గురుబ్రహ్మ వంటి చిత్రాలలో పాఠాలు చెప్పే గురువు పాత్రలో నటించి అలరించారు. ఇక ‘బలిపీఠం’ చిత్రంలో శోభన్ బాబు పంతులుగా నటించారు. ‘అమ్మమాట’లోనూ హీరోయిన్​కు పాఠాలు చెప్పే పాత్ర ధరించారు శోభన్. ‘మనుషులు-మట్టిబొమ్మలు’లో కృష్ణ స్కూల్ టీచర్​గా కనిపించారు. కృష్ణంరాజు ‘త్రిశూలం’లో మాస్టారుగా ఆకట్టుకున్నారు. ‘పిచ్చిపంతులు’లో మురళీమోహన్ పంతులుగానే నటించారు. ‘మూడుముళ్ళు’ చిత్రంలో చంద్రమోహన్ కూడా స్కూల్ టీచర్​గా కనిపించారు.

తర్వాతి తరం హీరోల్లో చిరంజీవి ‘మాస్టర్’లో లెక్చరర్​గా కనిపించి ఆకట్టుకున్నారు. ‘మాస్టరు’లో అధ్యాపకుడి పాత్రను పోషించిన మెగాస్టార్‌, అలాంటిదే మరో పవర్‌ఫుల్‌ పాత్రను ‘ఠాగూర్‌’లో చేశారు. తన దగ్గర చదువుకున్న విద్యార్థులతోనే అవినీతి అంతం చేసేందుకు భారీ వ్యవస్థనే ఏర్పాటు చేస్తారాయన. విద్యార్థుల శక్తేంటో ఓ మాస్టారు చూపించిన ఈ సినిమా తెలుగులో ప్రభంజనం సృష్టించింది.

ఇక బాలకృష్ణ ‘సింహా’లో అధ్యాపకునిగా కనిపిస్తే.. సుందరకాండలో వెంకటేశ్‌.. శిష్యులు దారి తప్పుతుంటే వారిని సక్రమమైన మార్గంలో నడిపించే గురువుగా కనిపించారు. తను చదివిన కళాశాలలోనే పాఠాలు చెప్పేందుకు వస్తాడు వెంకటేశ్వర్లు. గురువుపైనే ఆకర్షణకులోనై ప్రేమలో పడుతుంది ఓ శిష్యురాలు. ఆమెను మార్చి ఎలా కనువిప్పు కలిగించాడనే కథతో తెరకెక్కిన సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. గురువు ఎంత పవిత్రంగా ఉండాలో చూపించే సినిమా ఇది. ‘గురు’ సినిమాలో బాక్సింగ్‌ కోచ్‌గా అలరించారు.

విజయశాంతి ప్రతిఘటన.. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించే లెక్చరర్‌గా విజయశాంతి ప్రతిఘటనలో అద్భుతంగా నటించారు. స్త్రీల ఔన్నత్యాన్ని, వారిపై జరుగుతున్న దౌర్జన్యాలపైనా గొంతెత్తుందీ పాత్ర. సమాజ నిర్మాణంలో గురువుల బాధ్యత ఉందని చూపించిన ప్రతిఘటన సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇందులోనే ఓ పాట ద్వారా స్త్రీలపై జరుగుతున్న అకృత్యాలను లెక్చరర్‌గా విద్యార్థులకు చెప్పే ప్రయత్నం చేశారు విజయయశాంతి. మళ్లీ చాన్నాళ్ల తర్వాత మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోనూ లెక్చరర్‌గా విజయశాంతి మెప్పించారు.

జీవిత సత్యాలను విడమర్చి.. జీవితాన్నెప్పుడూ భిన్నమైన కోణంలో చూడాలని రావు రమేశ్‌ ‘కొత్తబంగారు లోకం’లో తన విద్యార్థులకు హితబోధ చేస్తాడు. ప్రేమ, ఆకర్షణ, జీవితాలపై తన శిష్యులకు స్పష్టమైన అవగాహన కల్పిస్తాడు. హీరో జీవితం సందిగ్ధంలో పడినపోయినప్పుడు కూడా ముందుకు కదిలే ప్రోత్సాహించి గెలిచేలా చేస్తాడు. రావు రమేశ్‌ పోషించిన ఈ పాత్ర కూడా తెలుగు తెరపై గుర్తుండిపోయేదే.

ఊరికోసం ఓనమాలు.. రాజేంద్రప్రసాద్ హీరోగా క్రాంతిమాధవ్‌ తీసిన సినిమా ‘ఓనమాలు’. ఇందులో రాజేంద్రప్రసాద్ పదవీ విరమణ తీసుకున్న స్కూల్‌ మాస్టారుగా చక్కని పాత్ర పోషించారు. అమెరికా నుంచి తిరిగొచ్చాక ఊళ్లో పరిస్థితులు చూసి చలించిపోతాడాయన. ఎలాగైనా అక్కడి మార్పు తేవాలనుకుంటాడు. అలా ఊరి బాగు కోసం ఆయన కృషి చేసే తీరు ఆకట్టుకుంటుది. పాఠాలు బోధించే గురువుకు పదవీ విరమణ అంటూ ఉండదని, సమాజానికి ఇలా ఏదో విధంగా సాయపడొచ్చని చూపించిన సినిమా ‘ఓనమాలు’.

శిష్యుల విజయాల్లోనే ఆనందాన్ని వెతుక్కొని సంతృప్తిపొందుతారు గురువులు. రాజమౌళి తెరకెక్కించిన ‘సై’ చిత్రంలో రగ్బీ పోటీ జరుగుతుంది. ఆట సగంలోనే జట్టుకు ఓటమి భయం పట్టుకుంటుంది. దారుణంగా విఫలమయ్యామనే భావనలో ఉంటారు జట్టు సభ్యులు. ప్రత్యర్థి జట్టు బలంగా, భయంకరంగా కనిపిస్తూ ఉంటుంది. గెలుపు మీద ఏమాత్రం ఆశల్లేని వారిని తన మాటలతో స్ఫూర్తిని రగిలిస్తాడు ఆ జట్టు శిక్షకుడు. ఈ పాత్రను రాజీవ్‌ కనకాల అద్భుతంగా పోషించారు.

కోచ్‌ అంటే ఇలా ఉండాలనే విధంగా ప్రేక్షకుల్లో బలంగా ముద్రేసిన చిత్రమిది. ఇలాంటి పాత్రనే సుమంత్‌ కూడా పోషించారు. ‘గోల్కొండ హైస్కూల్‌’లో క్రికెట్‌ కోచ్‌గా నటించి మెప్పించారు. చెక్ దే ఇండియాలో షారుక్, బిగిల్ లో విజయ్ది అదే దారి.

ఇక చాలా హీరోలు కూడా అధ్యాపకులుగా వెండితెరపై కనిపించి ఆకట్టుకున్నారు. ‘గీతగోవిందం’లో సినిమాలో విజయ్‌దేవరకొండది అధ్యాపక వృత్తే. అనువాద చిత్రమైన తెలుగునాట భారీ వసూళ్లు సాధించిన ‘మాస్టర్‌’లో విజయ్‌ది కూడా పాఠాలు చెప్పే టీచర్‌పాత్రే. ‘మిరపకాయ్‌’లో రవితేజ హిందీ టీచర్‌గా చేసిన అల్లరి తెలిసిందే. కమలినీ ముఖర్జీ, శ్రుతి హాసన్‌, ఆసిన్‌, ఇలియానా లాంటి హీరోయిన్లు కూడా టీచర్లుగా చేసి మెప్పించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version