‘గూఢచారి’ పావురాన్ని వదిలేశారు..!

-

వారం క్రితం జమ్ముకాశ్మీర్‌లో అనుమానాస్పదంగా కనిపించిన పావురాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు దాన్ని వదిలేశారు. గులాబీ రంగు వేసిన రెక్కలతో, కాలికి ఓ రింగు తొడగబడి ఉన్న ఓ పావురం గత ఆదివారం నాడు జమ్ము కాశ్మీర్‌లోని కతువా జిల్లాలో దొరికింది. కాలికిఉన్న ఆ రింగు మీద ఓ నంబరు ఉండటం, అది పాకిస్థాన్‌ వైపు నుండి రావడంతో, దాన్ని పాకిస్థాన్‌ ‘గూఢచారి’గా అనుమానించి పోలీసులు అరెస్టు చేశారు.

నాలుగైదు రోజుల దర్యాప్తు తర్వాత, ఎటువంటి అనుమానాస్పద సమాచారం లభించకపోవడంతో ఆ పావురాన్ని గురువారం నాడు వదిలేశామని జమ్ముకాశ్మీర్‌ సీనియర్‌ పోలీసు అధికారి శైలేంద్ర మిశ్రా రాయిటర్స్‌కు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆ పావురం ఎక్కడ దొరికిందో, అక్కడే వదిలేసినట్లు తెలిసింది. అయితే, పాకిస్థాన్‌ నుండి ఆ పావురం తనదేనంటూ హబీబుల్లా అనే వ్యక్తి తెలిపాడు. ఆ పావురం తన పెంపుడు పక్షి అని, దానికి ఎటువంటి గూఢచర్య, ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం లేదని అతను రాయిటర్స్‌ వార్తా సంస్థకు తెలియజేశాడు. దాని కాలికున్న రింగు మీద ఉన్న నంబరు నిజానికి తన మొబైల్‌ ఫోన్ నంబరని, కావాలంటే ఆ నంబరుకు ఫోన్‌ కూడా చేయవచ్చని ఆయన స్పష్టం చేశాడు. సరిహద్దు సమీపంలోని పాకిస్థాన్‌ గ్రామంలో నివసించే హబీబుల్లా, పావురాల పోటీలకు ఈ పావురాన్ని తరచూ పంపుతానని, అందుకే దాని రెక్కలకు గులాబీ రంగు వేసి, తన మొబైల్ నంబరుతో రింగు తొడిగానని శుక్రవారం నాడు తెలిపాడు. అయితే భారత పోలీసులు వదిలేసిన తర్వాత ఆ పావురం ఇంటికి చేరిందీ లేనిది తెలియరాలేదు.

‘‘ ఈ ప్రాంతం సాధారణంగా అత్యంత సున్నితమైనది. పైగా ఇటువంటి చొరబాట్లు గతంలో చాలాసార్లు జరిగాయి’ అని ఆ ప్రాంత పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మే 2015లో, అక్టోబరు 2016 లోనూ పాకిస్థాన్‌ నుంచి వచ్చిన పావురాలు పట్టుబడ్డాయని, అందులో ఒకటి భారత ప్రధానమంత్రికి బెదిరింపును మోసుకొచ్చిందని ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version