తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడంతో ప్రభుత్వం అలర్ట్ అవుతుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశాన్ని నిర్వహించారు. మూడు రోజులపాటు వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలను చేపట్టాలని కోరారు. రెస్క్యూ కోసం ప్రతి జిల్లాకు రూ. కోటి విడుదల చేసినట్లుగా తెలిపారు. మరోవైపు జిహెచ్ఎంసిలో మున్సిపల్, ట్రాఫిక్ విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.

తెలంగాణ రాష్ట్రంలో గత మూడు రోజుల నుంచి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటితో నిండిపోతున్నాయి. వాగులు, వంకలు, కాలువలు, చెరువులలో నీరు పొంగిపొర్లుతోంది. రోడ్లన్నీ నీటితో జలమయం అవుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో రోడ్లమీద వెళ్లే వాహనాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాలలో మరో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. వర్షపాతం అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేశారు.