ఆర్టీసీ సమ్మె నేటితో 40వ రోజుకు చేరుకుంది. అయినా కూడా ప్రభుత్వం మెట్టు తిగడం లేదు. ఇక తాజాగా ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మరో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్ డిపోకు చెందిన నరేష్ అనే డ్రైవర్ బుధవారం వేకువజామున పురుగుల మందు తాగాడు. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డ్రైవర్ మృతి చెందాడు. దీంతో మహబూబాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది. డిపో ఎదుట డ్రైవర్ మృతదేహంతో కార్మికులు ఆందోళన చేస్తున్నారు.
కాగా, మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన నరేష్ గత 15 ఏళ్లుగా ఆర్టీసీలో పని చేస్తున్నారు. డ్రైవర్ నరేష్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గత ఐదేళ్లుగా ఆయన సతీమణి అనారోగ్యంతో బాధపడుతోంది. నెలకు సుమారు ఐదువేల రూపాయలు మందులకు ఖర్చు అవుతున్నాయి. పిల్లల ఫీజులు, సంసారం గడవకపోవడంతో నరేష్ బాధపడుతున్నారు. సమ్మెకు ఎంతకీ పరిష్కారం కాకపోవడం, జీతం డబ్బులు రాకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.