హైకోర్టు తీర్పుతో.. చిక్కుల్లోపడ్డ కేసీఆర్..?

-

తెలంగాణ ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సమస్య పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేయాలని నిర్ణయించింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయం చెప్పాలని కోరింది. ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో మంగళవారం కూడా విచారణ కొనసాగింది.

ఈ హైకోర్టు తీర్పుతో కేసీఆర్ చిక్కుల్లోపడినట్టయింది. కోర్టు పదే పదే కేసీఆర్ సర్కారు తీరును ఇటీవల తప్పుబట్టింది. కానీ కేసీఆర్ సర్కారు హైకోర్టు ఆదేశాలను పెద్దగా పట్టించుకోలేదు. అంతే కాదు.. కోర్టు మాకు చెబుతుందా.. విధాన నిర్ణయాల్లో కోర్టు జోక్యం చేసుకుంటుందా.. అన్న తరహాలో కేసీఆర్ వ్యవహరించారు. కానీ ఇప్పుడు అదే కోర్టు త్రిసభ్య కమిటీ ఏర్పాటుతో కేసీఆర్ ను ఇరుకున పెట్టినట్టైంది.

 

కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమా? కాదా? అని చెప్పే అధికారం హైకోర్టుకు ఉందా అని హైకోర్టు ధర్మాసనం పదే పదే ప్రశ్నించింది. ఈ అంశంపై వివరించాలని సీనియర్‌ న్యాయవాది విద్యాసాగర్‌ను ఉన్నత న్యాయస్థానం కోరింది. ఎస్మా కింద సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించవచ్చని.. ఆర్టీసీని 1998, 2015లో ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని సీనియర్‌ న్యాయవాది విద్యాసాగర్‌ కోర్టుకు తెలిపినా హైకోర్టు అంగీకరించలేదు.

ఈ సమయంలో సమ్మె చట్టవిరుద్ధం అని చెప్పేందుకు అనేక విధాలా ప్రయత్నించింది. అయినా కోర్టు మాత్రం సమ్మెను చట్టవిరుద్దం అని పేర్కొనలేదు. ఇలాంటి సమయంలో త్రిసభ్య కమిటీ ఏర్పాటుకు కేసీఆర్ ఒప్పుకోకపోతే..ఇంకా డిఫెన్సులో పడిపోవడం ఖాయం. ఇప్పటికే ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం నెలకొంది.

అందువల్ల హైకోర్టు వేసిన కమిటీకి ఆమోదం చెప్పే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే.. ఆ కమిటీ కూడా కార్మికులకు అనుకూలంగా సిఫారసులు చేస్తే కేసీఆర్ సర్కారు చిక్కుల్లో పడే అవకాశం ఉంది. చూడాలి ఏంజరుగుతుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version