వన్ నేషన్.. వన్ ఎలక్షన్ కు అవకాశం ఉందా..?

-

వన్ నేషన్ వన్ ట్యాక్స్, వన్ నేషన్ వన్ రేషన్ ను ఇప్పటికే అమలు చేసిన కేంద్రం.. ఇప్పుడు జమిలి ఎన్నికల దిశగా వన్ నేషన్ వన్ ఓటర్ లిస్ట్ రెడీ చేస్తోంది. అటు ప్రధాని కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సులో జమిలి ఎన్నికల గురించి మరోసారి ప్రస్తావించారు. బీహార్ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లో గెలిచిన బీజేపీలో.. మళ్లీ జమిలి జోష్ కనిపిస్తోంది. అయితే జమిలి ఎన్నికలు సాధ్యమేనా..? లాభనష్టాలేంటి..ఏవైనా రాజ్యాంగ సవరణలు అవసరమౌతాయా అన్నదాని పై ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతుంది.

కొన్నాళ్లుగా జమిలి జపం చేస్తున్న బీజేపీ.. మరోసారి వన్ నేషన్ వన్ ఎలక్షన్ చర్చ తీసుకొచ్చింది. ఏకకాలంలో ఎన్నికలు జరిగితే.. ప్రజాధనం ఆదా అవుతుందని సాక్షాత్తూ ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. జమిలి ఎన్నికలపై చర్చ జరగడం కాదు.. అవి దేశానికి అత్యవసరమని తేల్చేశారు. దేశంలో ఇప్పటికిపుడు ఎన్నికలు పెడితే మోడీ తప్ప మొనగాడు లేడని.. బీహార్ సహా వివిధ రాష్ట్రాలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు, ఉప ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయంటోంది బీజేపీ. అందులో హిందీ బెల్ట్ రాష్ట్రాలు ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటివి ఉన్నాయి. ఇక సౌత్ లో కర్ణాటక లో బీజేపీ పట్టు బాగానే నిలుపుకుంది. తెలంగాణాలో దుబ్బాక బంపర్ ఆఫర్ ఇచ్చేసింది. దాంతో బీజేపీ శిబిరంలో జోష్ మామూలుగా లేదు అంటున్నారు.

జమిలి ఎన్నికల ముచ్చట బీజేపీకి అలాగే ఉండిపోయింది. ఒకే దేశం, ఒకే విధానం, ఒకే పార్టీ, ఒక్కడే నాయకుడు ఇలాంటివాటికి బీజేపీ గట్టిగా మద్దతిస్తుంది. నిజానికి ఇది ఆర్ఎస్ఎస్ భావజాలం. దేశంలో భిన్న వాదనలు ఉంటే ఐక్యత దెబ్బతింటుందని ఆర్ఎస్ఎస్ నేతలు గట్టిగా భావిస్తారు. ఇపుడున్న పరిస్థితుల నుంచి గరిష్ట రాజకీయ లబ్దిని పొందేందుకు బీజేపీ ప్రయత్నించకుండా ఉంటే తప్పు చేసినట్లే. అందువల్ల ఆ తప్పు అసలు చేయదు అంటున్నారు. అందుకే 2022లో జమిలి ఎన్నికలకు రెడీ అవుతుంది అనే వాదన వినిపిస్తోంది. దేశంలో రాజకీయ వాతావరణం సానుకూలంగా ఉన్న వేళ అన్ని రాష్ట్రాలు, ప్రాంతాలు కలుపుకుని ఒకేసారి ఎన్నికలకు వెళ్ళి మళ్లీ మోడీని ప్రధానిగా ప్రతిష్ఠించాలన్న ఆరెస్సెస్ అజెండా వర్కౌట్ కావడానికి సమయం ఎంతో దూరం లేదు అంటున్నారు.

ఇక తెలుగు రాష్ట్రాలో కూడా పాగా వేయాలని ఉబలాట పడుతున్న బీజేపీకి ఇక్కడ అంతా ప్లస్ అవుతుందా అన్నది ఒక చర్చగా ఉంది. తెలంగాణాలో లిట్మస్ టెస్ట్ గా దుబ్బాక ఫలితం వచ్చిందనేది కమలనాథుల అభిప్రాయం. టీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉన్నా ఇన్నాళ్ళూ సరైన పార్టీ లేకనే జనాలు ఓటు చేయలేదు అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇపుడు ఆ లోటు భర్తీకి బీజేపీ రెడీగా ఉంది కాబట్టి తెలంగాణాపైన ఆశలు భారీగా పెంచుకోవ‌చ్చనే ఆలోచనలో బీజేపీ ఉంది. ఏపీలో జగన్ మీద మోజు తగ్గిందా.. లేక‌ అలాగే ఉందా అన్న దానికి కొలమానం తిరుపతి ఎంపీ సీటుకు ఉప ఎన్నికలు, అలాగే త్వరలో ఏపీలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు. ఈ రెండూ చూసుకుని ఏపీలో రాజకీయ అవసరాలు, అవకాశాలు బీజేపీ బేరీజు వేసుకుంటుందని అంటున్నారు.

జమిలి ఎన్నికలు ఎప్పుడు జరపాలన్న విషయంలో కేంద్రంలో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి. 2022 ఫిబ్రవరి- మార్చి నెలల్లో ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, మణిపూర్‌ ఎన్నికలు జరుగునున్నాయి. 2022 అక్టోబర్‌, డిసెంబర్‌ నెలల్లో హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ ఎన్నికలు జరగనున్నాయి. 2022 , 2023, 2024లో జరగాల్సిన ఎన్నికలను కూడా అవసరమైనంత కాలం వాయిదా వేయడమో, ముందుకు జరపడమో చేసి- దేశ వ్యాప్తంగా లోక్‌ సభ, అన్ని అసెంబ్లీలు, స్థానిక ఎన్నికలను ఒకేసారి జరిపించాలన్నది మోడీ సర్కార్‌ వ్యూహం.ఇప్పటికే జమిలి ఎన్నికల నిర్వహణను సాకారం చేసే దిశగా కేంద్రం మరో అడుగు ముందుకేసింది. దేశంలో జరిగే అన్ని ఎన్నికలకూ ఒకే ఒక ఓటరు జాబితా ఉండే విధంగా దృష్టి పెట్టింది.

జమిలి ఎన్నికల ప్రతిపాదనను సమర్థిస్తూ చెప్పే కారణాలు ఎంత బలమైనవో, వ్యతిరేకిస్తూ చెప్పే కారణాలు సైతం అంతే బలమైనవి.జమిలి ఎన్నికలు ఓటర్ల కన్‌ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అదీ కాక, క్రాస్ ఓటింగ్ జరిగే ప్రమాదమూ ఉంది. అందువల్ల లోక్ సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్ని ఒకేసారి నిర్వహించడం సరైన నిర్ణయం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఖర్చును తగ్గించే ఉద్దేశమే కీలకమైతే… మరింత పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తే… ఆటోమేటిక్‌గా ఖర్చును తగ్గించే అవకాశం ఉంటుందంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version