మోర్బీ కేబుల్ బ్రిడ్జి ఘటన.. పరారీలో ఒరెవా సంస్థ యజమానులు

-

గుజరాత్ మోర్బీ కేబుల్ బ్రిడ్జికి మరమ్మతు చేసిన కంపెనీ ఒరెవాపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఆ కంపెనీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఘటన జరిగినప్పటి నుంచి ఆ కంపెనీ యజమానులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు వారిని ఇంకా అదుపులోకి తీసుకోలేదని సమాచారం. దీనిపై విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత చిదంబరం కేంద్రం, గుజరాత్ సర్కార్‌ తీరుపై మండిపడ్డారు.

‘మోర్బీ దుర్ఘటన జరిగి మూడురోజులు అవుతున్నా.. గుజరాత్ ప్రభుత్వం, భాజపా ఇంతవరకూ సాధారణ ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వడం లేదు..? ఒరెవా సంస్థ యజమానులు, మున్సిపల్‌ అధికారుల పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో ఎందుకు నమోదు చేయలేదు..?’ అని ఆయన పలు ప్రశ్నలు సంధించారు.

పర్యాటకులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే.. బ్రిడ్జి కనీసం ఎనిమిది నుంచి పదేళ్లవరకు మనగలదని ఇదివరకు ఒరెవా ఎండీ జయ్‌సుఖ్‌భాయ్‌ పటేల్ వ్యాఖ్యానించారు. బ్రిడ్జ్‌ కూలిపోయిన దగ్గరి నుంచి ఆ వ్యక్తి ఆచూకీ లేదు. అహ్మదాబాద్‌లోని కంపెనీ ఫామ్‌హౌజ్‌కు తాళం వేసి ఉంది. కనీసం సెక్యూరిటీ గార్డ్ కూడా లేరని మీడియా వర్గాలు వెల్లడించాయి. బ్రిడ్జ్‌ మరమ్మతుకు సంబంధించి మున్సిపల్ అధికారులతో చేసుకున్న ఒప్పందంలో ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. నిర్మాణరంగంలో ఎలాంటి అనుభవం లేని వారికి ఈ పనులు అప్పగించడం తీవ్ర ఆగ్రహానికి దారితీస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version