అధికార వైసిపి ఎమ్మెల్యే అయి ఉండి మంత్రులనే దూషిస్తారు. తన వెంట ఉండే నాయకులను, కార్యకర్తలను నోటి దురుసుతో దూరం చేసుకుంటారు చివరకు అధిష్ఠానంతో చివాట్లు తిన్నా ఆ ఎమ్మెల్యే వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఎమ్మెల్యే నోటి దురుసుతనం చిక్కుల్లో పడేస్తోంది.
మొదటిసారే ఎమ్మెల్యే అయిన వరుస వివాదాల్లో చిక్కుకున్న ఎమ్మెల్యే చిట్టిబాబు మామిడికుదురు మండలం నగరంలో నిర్వహించిన పాదయాత్ర సభలో వాలంటీర్ పై ఆగ్రహం వ్యక్తం చేయటంతో సదరు మహిళా వాలంటీర్ ఆత్మహత్యాయత్నం చేయటం ఎమ్మెల్యేను టెన్షన్ పెట్టింది. తాజాగా మంత్రులు తన పాలిట దుష్టశక్తులు అంటూ వ్యాఖ్యలు చేయటంతో గోదావరి జిల్లాలో ఎమ్మెల్యే పై హాట్ హాట్ గా చర్చ నడుస్తుంది.
తాజాగా ఎమ్మెల్యే ఫ్రస్ట్ర్రేషన్ లో ఉన్నట్లుగా కనిపిస్తోంది. జిల్లా మంత్రి పినిపే విశ్వరూప్ తో ఉన్న విభేదాలు కారణంగానే ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేసినట్లు అర్థమౌతోంది. నియోజకవర్గంలో తనకు ప్రజలకు మధ్య అంతరాన్ని సృష్టిస్తూ మంత్రులు దుష్ట శక్తులుగా మారారని ఎమ్మెల్యే చిట్టిబాబు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించకుండా మంత్రులు తనను ఏకాకిని చేస్తున్నారని విమర్శించారు. నాయకులు, కార్యకర్తలపై కూడా అదే నోటి దురుసుగా మాట్లాడతారు. దీంతో ఎన్నికల్లో వెన్నంటి ఉండి గెలిపించిన సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రక్కనే ఉన్న అమలాపురం నియోజకవర్గానికి చెందిన జిల్లా మంత్రి పినిపే విశ్వరూప్ వెంట వెళ్ళిపోతున్నారు.
నోటి దురుసు తనం మార్చుకోమని అధిష్ఠానం పలుమార్లు వార్నింగ్ ఇచ్చింది. ఎమ్మెల్యే అయిన కొత్తలో తన కుమారుడు కొండేటి వికాస్ పుట్టినరోజు వేడుకల కేక్ కటింగ్ అంబాజీపేట ప్రధాన రోడ్డుపై పెట్టి గంటల తరబడి ట్రాఫిక్ ను నిలిపివేసి ప్రజలు, అధిష్టానం ఆగ్రహానికి ఎమ్మెల్యే చిట్టిబాబు గురయ్యారు. ఎమ్మెల్యే కొడుకు అయితే ఏంటి ఇంత బలుపు అని స్థానికుల నుండి విమర్శలు ఎదుర్కొన్నారు. జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా పార్టీ అధిష్ఠానంను ధిక్కరించి తన కుమారుడికి అయినవిల్లి జెడ్పీటీసీ టిక్కెట్ బీ ఫారం ఇచ్చుకున్నారు. దీనితో పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని కష్టపడిన కార్యకర్తలకు టిక్కెట్లు ఇస్తూ వేరే బీ ఫారం లను పంపించింది.
మొదట్లో సహకరించిన ఎంపి అనురాధ సైతం ఎమ్మెల్యే చిట్టిబాబు వ్యవహారశైలి నచ్చక కార్యకర్తలు నుండి వస్తున్న ఫిర్యాదులతో పక్కన పెట్టారు. తీరు మార్చుకోవాలని పార్టీ అధిష్ఠానం మందలిస్తున్న ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు రోజు రోజుకు వివాదస్పద వ్యక్తిగా మారుతున్నారు. ఇప్పటికైనా అధిష్ఠానం సీరియస్ గా తీసుకోకపోతే ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు నోటి దురుసుకు ఇటు ప్రభుత్వం, అటు పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.