సినిమా చూస్తున్నప్పుడో, సాయంత్రం వేళ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నప్పుడో చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేస్తే ఆ ‘క్రంచీ’ శబ్దం, ఆ కారం, ఉప్పు ఇచ్చే కిక్కే వేరు! ఒక్క చిప్స్ ముక్కతో ఆపడం ఎవరికైనా కష్టమే. కానీ ఆ రంగురంగుల ప్యాకెట్ల వెనుక దాగి ఉన్న అసలు నిజం మీకు తెలుసా? పిల్లలు ఎంతో ఇష్టం గా తినే ఆ ప్యాకెట్ చిప్స్ లో రుచి కోసం వాడే మితిమీరిన ఉప్పు మన శరీరంలో నిశ్శబ్దంగా ఒక తుపానును సృష్టిస్తోంది. అందరు ఇష్టంగా తినే ఈ చిప్స్ మన ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
చిప్స్ ప్యాకెట్లు, ఉప్పుతో పొంచి ఉన్న ముప్పు: చిప్స్ అంటే కేవలం ఆలుగడ్డ ముక్కలు మాత్రమే కాదు అవి సోడియం మరియు శుద్ధి చేసిన నూనెల భాండాగారాలు. ముఖ్యంగా అందులో ఉండే అధిక మోతాదు ఉప్పు (Sodium) శరీరానికి నెమ్మదిగా విషంలా మారుతుంది.
రక్తపోటు మరియు గుండె ఆరోగ్యం: మన శరీరానికి రోజుకు కావాల్సిన సోడియం చాలా తక్కువ. కానీ ఒక్క చిన్న చిప్స్ ప్యాకెట్ తింటేనే రోజూవారీ కోటాలో సగానికి పైగా సోడియం శరీరంలోకి చేరుతుంది. రక్తంలో సోడియం పెరిగినప్పుడు, అది నీటిని పట్టి ఉంచుతుంది. దీనివల్ల రక్త పరిమాణం పెరిగి, ధమనులపై ఒత్తిడి పడుతుంది. ఫలితంగా అధిక రక్తపోటు వస్తుంది, ఇది భవిష్యత్తులో గుండెపోటు లేదా స్ట్రోక్‌కు దారితీస్తుంది.

కిడ్నీలపై ప్రభావం: శరీరంలోని వ్యర్థాలను, అదనపు సోడియంను వడకట్టే బాధ్యత కిడ్నీలది. మనం నిరంతరం చిప్స్ వంటి జంక్ ఫుడ్స్ తిన్నప్పుడు, కిడ్నీలు ఓవర్ టైం పనిచేయాల్సి వస్తుంది. కాలక్రమేణా ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి లేదా కిడ్నీ పనితీరు మందగించడానికి కారణమవుతుంది.
మెదడు మరియు వ్యసనం: చిప్స్ తయారీలో ఉప్పుతో పాటు MSG (మోనోసోడియం గ్లుటామేట్) వంటి రుచి కారకాలను కలుపుతారు. ఇవి మెదడులోని ‘డోపమైన్’ అనే హార్మోన్‌ను విడుదల చేస్తాయి, దీనివల్ల మనకు ఆ చిప్స్ మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. ఇది ఒక రకమైన ఆహార వ్యసనం లాంటిది.
ఊబకాయం మరియు ఎముకల బలహీనత: అధిక ఉప్పు ఎముకల్లోని కాల్షియంను మూత్రం ద్వారా బయటకు పంపివేస్తుంది. దీనివల్ల ఎముకలు గుల్లబారి ‘ఆస్టియోపోరోసిస్’ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే, వీటిలోని ట్రాన్స్ ఫ్యాట్స్ మరియు క్యాలరీలు శరీర బరువును అడ్డూఅదుపు లేకుండా పెంచుతాయి.
