భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి జాతీయ అత్యుత్తమ పురస్కరాలను ప్రకటించిన విషయం తెలిసిందే. అవార్డులు అందుకునే వారిలో సినీ, సేవా రంగాలకు చెందిన వారు ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ పురస్కారం వరించింది.
ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాలయ్యకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా పవన్ స్పెషల్ ట్వీట్ చేశారు. ‘ఐదు దశాబ్దాలకుపైగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన అభినయంతో ప్రేక్షకులను మెప్పించిన బాలకృష్ణ పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక కావడం సంతోషంగా ఉంది. వెండితెరపై విభిన్న పాత్రలు పోషించిన ఆయన హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్గా ఎన్నో సేవలందించారు. ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. పద్మ పురస్కారాలకు ఎంపికైన అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చారు.