పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్ (70)కు అయిదు ఉగ్రవాద కేసుల్లో గతంలో ఇచ్చిన ముందస్తు బెయిలు గడువును లాహోర్ హైకోర్టు పొడిగించింది. ఈ మేరకు మార్చి 27 దాకా పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పటిష్ఠమైన బందోబస్తు నడుమ శుక్రవారం రోజున ద్విసభ్య ధర్మాసనం ముందు ఇమ్రాన్ హాజరయ్యారు.
‘‘నా జీవితం ప్రమాదంలో ఉంది. కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా పంజాబ్ పోలీసులు లాహోర్‌లోని నా నివాసంపై దాడి చేసి బీభత్సం సృష్టించారు’’ అని ఇమ్రాన్ కోర్టుకు నివేదించారు. ఆయన వాదన విన్న న్యాయమూర్తులు పంజాబ్ ప్రావిన్సు ప్రభుత్వానికి, పంజాబ్ పోలీస్ ఐజీకి నోటీసుల జారీకి ఆదేశించారు. గతేడాది ఏప్రిల్‌లో పాకిస్థాన్ ముస్లింలీగ్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఏర్పడ్డాక పాక్‌లోని వివిధ పోలీస్‌స్టేషన్లలో ఇమ్రాన్‌పై మొత్తం 143 కేసులు నమోదయ్యాయి.
మరోవైపు ఇమ్రాన్ పార్టీని నిషేధిత సంస్థగా ప్రకటించే ప్రక్రియను ప్రారంభించేందుకుగానూ న్యాయ నిపుణులను సంప్రదించాలని పాక్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు పాక్ మంత్రి రాణా సనావుల్లా తెలిపారు. స్థానిక వార్తాసంస్థ ఈ విషయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. జమాన్ పార్కులో ఉగ్రవాదులు దాక్కున్నారని.. ఇమ్రాన్ నివాసంలో ఆయుధాలు, పెట్రోల్ బాంబులు చిక్కాయని సనావుల్లా తెలిపారు. ఉగ్రవాద సంస్థగా PTI పై కేసు నమోదు చేయడానికి ఇవే సాక్ష్యాలు అని సనావుల్లా చెప్పారు.