కేజీయఫ్-1తో పోలిస్తే కేజీయఫ్-2లో వెంట్రుక వాసంత స్క్రీన్‌ప్లే తగ్గిందని ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ప్రశాంత్ నీల్ – యశ్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న ‘కేజీయఫ్ – 2’పై తన అభిప్రాయాన్ని బయటపెట్టారాయన. ‘కేజీయఫ్ – 2’పై రివ్యూనిస్తూ ‘పరుచూరి పలుకులు’ వేదికగా తాజాగా ఓ వీడియో షేర్ చేశారు. కేజీయఫ్-2లో ఓ సీన్ మింగుడుపడేలా లేదని.. దాన్ని మరోలా తీసి ఉంటే బాగుండేదని పరుచూరి అభిప్రాయపడ్డారు.
”కేజీయఫ్ ఛాప్టర్ 1.. కనీవినీ ఎరుగని విజయం అందుకొంది. ఛాప్టర్ 2.. రూ. 1250 కోట్లు వసూళ్లు సాధించిందంటున్నారు. సంవత్సరంపాటు ఆడిన సినిమాల్లోనూ లెవెన్త్ అవర్ ఉంటుంది. ఏ చిత్రం విషయంలోనైనా కొన్నిసార్లు తప్పులు జరుగుతుంటాయి. అవి జరగలేదని సమర్థించుకోలేం. తప్పు తప్పే. కానీ, కొన్ని సందర్భాల్లో అవి కనిపించవు. విశేష ప్రేక్షకాదరణ లభిస్తుంది. కేజీయఫ్-2 రివ్యూలను చూస్తే.. దీన్ని ఆహా ఓహో అని రాయలేదు. కొంత విమర్శనాత్మకంగానే రాశారు. 2018లో కేజీయఫ్ ఛాప్టర్ 1 వచ్చింది. సుమారు నాలుగేళ్ల తర్వాత ఛాప్టర్ 2 విడుదలైంది. దాంతో, పార్ట్ 1 చూస్తేనే గానీ పార్ట్ 2 అర్థంకాదేమో అనుకునే పరిస్థితి నెలకొంది. అందుకే ప్రశాంత్ నీల్ చాలా తెలివిగా స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్ చేశాడు. తొలిభాగంలో హీరో పేదవాడు నుంచి ధనికుడిగా మారతాడు. పేదవాడు గొప్పవాడిగా ఎలా మారాడు అనే ఎలిమెంట్ పాతాళ భైరవి కాలం నుంచి సూపర్ హిట్ అయ్యింది. ఆ ఎలిమెంట్‌లోనే అంత గొప్పతనం ఉంది.
హీరో పాత్ర కేజీయఫ్-1లో పేదవాడు నుంచి ధనికుడిగా మారితే కేజీయఫ్-2లో అపర కుబేరుడిగా కనిపిస్తాడు. సేవకుడిగా ఉండే యజమానిగా యశ్ కనిపిస్తాడు. సుమారు 16 దేశాల్లో రాఖీబాయ్‌పై కేసులు పెట్టినట్లు ముందే దర్శకుడు చెప్పేశాడు. కాబట్టి ఈ కథను నడిపించటం తేలికైన విషయం కాదు. ప్రశాంత్ నీల్ జాగ్రత్తగా వ్యవహరించకపోయినట్లైతే ఛాప్టర్-2 విషయంలో దొరికిపోయేవాడు. సంపాదించిందంతా తనొక్కడే తినకుండా అనుచరుల క్షేమాన్నీ కోరుకుంటాడనేలా హీరో పాత్రని తీర్చిదిద్దాడు. ముస్లిం కుర్రాడి పాత్ర పోషించిన యువకుడు ఈ సినిమాకి రెండో హీరోగా ఉంటాడు. నరాచీ చెక్‌పోస్ట్ నేపథ్యంలో ఆ పాత్ర చనిపోయినా.. హీరో దగ్గర పనిచేసే అమ్మలంతా ఆయన్ని తిట్టకుండా ఆశీర్వదిస్తారు. హీరో ఎంతగా వారికి సాయపడ్డాడో ఈ దృశ్యం తెలియజేస్తుంది.
ఇక, రెండో విషయం ఏమిటంటే.. ఈ కథ త్వరగా అందరికీ నచ్చదు. ఎందుకంటే ఇదొక ఫిక్షనల్ స్టోరీ. కానీ ఈ రెండు ఛాప్టర్లను ఫిక్షనల్ స్టోరీలుగా ప్రశాంత్‌నీల్ తెరకెక్కించలేదు. అది ఆయన గొప్పతనం. జరిగిన కథనే మనకు చూపిస్తున్నారే భావన కలిగించారు. రమికాసేన్ (రవీనా టాండన్) పాత్రని చూస్తే ఇందిరాగాంధీని గుర్తు చేసేలా ఉంటుంది. రాఖీబాయ్ విషయం పార్లమెంట్‌లో చర్చకు వెళ్లడం.. పోలీసులు, సీబీఐ రంగంలోకి దిగడం.. వంటివి చూస్తే ఇది జరిగిన కథే అనే భావన ప్రేక్షకుడి మదిలో మెదులుతుంది. ఈ విషయంలో ప్రశాంత్‌నీల్ విజయం సాధించగలిగాడు. బాలీవుడ్‌లో ప్రముఖ నటుడు సంజయ్‌దత్‌ని విలన్‌గా చూపించి మరో మంచి ప్రయత్నం చేశాడు. దాని వల్ల ప్రతి నాయకుడు.. హీరోని ఏం చేస్తాడో? హీరో ఎలా ఎదుర్కొంటాడో? అనే ఉత్సుకత చూసే ప్రేక్షకులకు కలుగుతుంది.
ఒక షాట్‌లో యశ్‌ని సంజయ్‌దత్ తుపాకీతో కాలుస్తాడు. హీరోని చంపేసే ఆస్కారం ఉన్నప్పటికీ ‘పో వెళ్లిపో’ అని వదిలేస్తాడు. ఆ షాట్ అందరికీ నచ్చదు. ఆ తర్వాత మరో షాట్‌లో సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. ఈసారి హీరో విలన్‌ని కాలుస్తాడు. చంపే ఛాన్స్ ఉన్నా బతికిపొమ్మని వదిలేస్తాడు. దీని వల్ల ప్రపంచాన్నే భయపట్టే ఓ ప్రతినాయకుడ్ని.. హీరో భయపెట్టాడనే ఆలోచన అందరిలో కలుగుతుంది. హీరో స్థాయిని పెంచే సీన్ అది. మరో చోట ప్రధానమంత్రి ఇంటికి యశ్ వెళ్లినప్పుడు ఇంకాస్త మర్యాద పూర్వకంగా ఉండుంటే బాగుండేదనిపించింది.
రాఖీబాయ్.. పార్లమెంట్‌కు వెళ్లి ప్రధాన మంత్రి ఎదురుగానే పాండ్యన్‌ని కాల్చి చంపినట్లు సినిమాలో చూపించారు. ఆ సీన్ బాగానే ఉన్నప్పటికీ దాన్ని పార్లమెంట్‌లో కాకుండా పార్టీ కార్యాలయంలో చిత్రీకరించి ఉండుంటే బాగుండేది. ఎందుకంటే ప్రధానమంత్రిని ఎదురుగా పెట్టుకుని ఓ వ్యక్తిని కాల్చేయడం అంత సాధారణంగా మింగుడుపడని విషయం. హీరోయిన్ పాత్రని గర్భవతిగా చూపించి చంపేశారు. ఒకవేళ ఆ అమ్మాయినే కనుక చంపకుండా ఉండుంటే ఈ అమ్మాయి కడుపున పుట్టేవాడు ‘కేజీయఫ్-3’లో హీరోగా వస్తాడనే భావన కలిగేది.
ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఎక్కడా దొరక్కుండా చివరికి హీరో తన కథకు తనే ముగింపు చెప్పుకొన్నాడు. సముద్రంలో హీరో మునిగిపోతున్నట్లు చూపించి.. అతడు చనిపోయాడని ప్రకాశ్‌రాజ్ చెప్పాడు. ఒకవేళ మూడో ఛాప్టర్ కనుక తీస్తే రాఖీబాయ్‌పై 16 దేశాల్లో ఉన్న కేసులపైనే సినిమా ఉండొచ్చు అనుకుంటున్నా. సముద్రంలో మునిగిపోయినట్లు చూపించిన రాఖీబాయ్ మళ్లీ బతికే ఉన్నట్లు చూపించే అవకాశం ఉంది. ఒక దక్షిణాది చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లు సాధించిందంటే ప్రశాంత్‌కు హ్యాట్సాఫ్. కథ, కథనం గొప్పగా లేకపోతే ఇన్ని కోట్లు వసూళ్లు రాబట్టదు. కేజీయఫ్-1లో ఉన్నంత పకడ్బందీ స్క్రీన్‌ప్లే ఇందులో వెంట్రుక వాసంత తగ్గిందనేది నా భావన’’ అని పరుచూరి చెప్పుకొచ్చారు.